రక్షణ ఎఫ్ డి ఐ లకు సులభతరం కానున్న నిబంధనలు

SMTV Desk 2017-06-06 15:37:34  defence, fdi, central governament, defence ministry

న్యూఢిల్లీ, జూన్ 6 : రక్షణ రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఆటోమేటిక్ మార్గంలో 49 శాతం ఎఫ్ డి ఐ లను పెట్టు బడిగా పెట్టే అవకాశం ఉంది. అయితే అనుమతులతో నూటికి నూరుశాతం వరకు పెట్టుబడులకు ఆవకాశం కల్పించారు. గతంలో కొంత మేర నిబంధనలు సరళీకరించినప్పటికీ ఆశించిన ఫలితం లేక పోవడంతో, నిబంధనలను మరింత సులభతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ దిశ గా చేసే ప్రయత్నాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి సీఐఐ, ఫిక్కీ తదితర పారిశ్రామిక సంఘాలను ఆహ్వానించింది. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టేలా విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఏం చేస్తే బావుంటుందని సమావేశంలో సలహాలు కోరారు. విదేశీ ఇన్వెస్టర్లు ఏ దేశంలో అయినా తయారీ యూనిట్ ను ఏర్పా టు చేసేందుకు విదేశీ ఇన్వెస్టర్లు హామీతో కూడిన ఆర్డర్లను కోరుకుంటారని వెల్లడించారు. 2016లో కేంద్రంలోని మోదీ సర్కారు రక్షణ సహా పలు రంగాల్లో ఎఫ్ డీ ఐ లకు సంబంధించి నిబంధనలను సరళీకరించింది. ప్రస్తుతం ఈ రంగంలో ఆటోమేటిక్ మార్గంలో విదేశీ ఇన్వెస్టర్లు 49 శాతం వరకూ పెట్టుబడులకు అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం అనుమతి మేరకు 100 శాతం వరకు పెట్టుబడులకు అవకాశం కల్పించారు. అయితే గత 16 సంవత్సరాలుగా రక్షణ రంగంలో ఎఫ్ డిఐ లుగా కేవలం 25 కోట్లు మాత్రమే సమకూరాయి. మనదేశంలో రక్షణ ఉత్పత్తులకు ప్రభుత్వం ఒక్కటే కొనుగోలు దారుగా ఉంది. దేశం నుంచి రక్షణ రంగం ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అధిక నియంత్రణలు అడ్డుపడుతున్నాయి. అదే విధంగా మన దేశం 70 శాతం మిలటరీ ఉత్పత్తులను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం గత నెలలోనే ఓ విధానాన్ని ప్రకటించింది. ప్రైవేటు కంపెనీలు విదేశీ సంస్థలతో కలిసి సబ్ మెరైన్లు, ఫైటర్ జెట్స్ వంటి వాటిని నిర్మించేందుకు అవకాశం కల్పించింది.