తాగునీటి పై త్రిసభ్య కమిటి తుద్ది నిర్ణయం...

SMTV Desk 2017-09-23 14:51:34  Third Committee meeting, Krishna river management board member, Telangana irrigation Chief Engineer in Chief Muralidhar, Engineer in chief of Water Resources of AP Venkateshwara Rao

హైదరాబాద్, సెప్టెంబర్ 23 : రెండు తెలుగు రాష్ట్రాల తీరుపై కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డులోని సభ్యకార్యదర్శి సమీర్‌ ఛటర్జీ, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, ఆంధ్రప్రదేశ్‌ జల వనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావులతో కూడిన త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా బోర్డు అనుమతి లేకుండా ఇరు రాష్ట్రాలు నీటిని విడుదల చేసుకోవడం సరికాదని సభ్యకార్యదర్శి రెండు రాష్ట్రాల ఈఎన్‌సీల దృష్టికి తెచ్చారు. వచ్చే ఏడాది జులై వరకు తాగునీటి అవసరాలకు నిల్వ ఉంచుకోవాల్సి ఉన్నందున, సాగుకు ఇవ్వడం వీలుకాదని త్రిసభ్య కమిటీ నిర్ణయానికి వచ్చింది. అక్టోబరు 15 వరకు వచ్చే ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకొని అప్పుడు మెరుగ్గా ఉంటే రబీలో ఆరుతడి పంటలకు ఒకటి, రెండు తడులు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని, అది కూడా వచ్చే నెలలో బోర్డు పూర్తి స్థాయి సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. ప్రస్తుతం తాగునీటి అవసరాలకు ఆంధ్రప్రదేశ్‌కు 16 టీఎంసీలు, తెలంగాణకు తొమ్మిది టీఎంసీలు కేటాయించింది. తెలంగాణకు కేటాయించిన నీటిలో రెండు టీఎంసీలను శ్రీశైలంలోనే నిల్వ ఉంచి వచ్చే నెలలో తీసుకోనున్నారు శ్రీశైలంలో నెల రోజులపాటు 854 అడుగుల మట్టం, నాగార్జునసాగర్‌లో 510 అడుగుల మట్టం కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రాజెక్టులు బోర్డు ఆధీనంలో ఉంటే ఈ సమస్య ఉండేది కాదని ఆంధ్రప్రదేశ్‌ ఈఎన్‌సీ పేర్కొనగా, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే ఏడాదైనా తీసుకోవాల్సి వస్తుందని, దీనికి తగ్గ యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ ఈఎన్‌సీ సూచించినట్లు తెలిసింది. ప్రాజెక్టుల్లోకి ఇప్పటివరకు చేరిన నీటి ప్రవాహం, వచ్చే ఏడాది వరకు తాగునీటి అవసరాలను గురించి త్రిసభ్య కమిటీ చర్చించింది.