ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రో ప్రారంభం : కేటీఆర్

SMTV Desk 2017-09-22 15:23:46  Metro train, Prime Minister Modi, IT Minister KTR

హైదరాబాద్, సెప్టెంబర్ 22 : మెట్రో రైలు తొలి దశను నవంబర్ లో ప్రారంభిస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పునరుధ్ఘాటించారు. ప్రపంచంలోనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన అతిపెద్ద మెట్రో రైలు ప్రాజెక్ట్‌ కావడంతో ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తే బాగుంటుందని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. నగరంలో మెట్రో రెండోదశపై ప్రణాళికలు రూపొందించామని, మంత్రి మండలి నిర్ణయం తరువాత సరైన సమయంలో వివరాలు ప్రకటిస్తామన్నారు. సికింద్రాబాద్‌ ఒలిఫెంటా వంతెన వద్ద అత్యంత క్లిష్టమైన స్టీల్‌ బ్రిడ్జి పనులు పూర్తయిన నేపథ్యంలో కేటీఆర్ గురువారం స్వయంగా పరిశీలించారు. అనంతరం నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు ఎండీ శివానంద్‌ నింబర్గిలతో సికింద్రాబాద్‌ ఈస్ట్‌ మెట్రో రైలు స్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ ముచ్చటించారు. నవంబరు 28న మెట్రో మార్గాన్ని ప్రారంభించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రధానిని గత నెలలో కలిసి లిఖిత పూర్వకంగా ఆహ్వానించారని గుర్తు చేశారు. ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం రావాల్సి ఉందన్నారు. ప్రధాని సమయం ఇచ్చినప్పుడే మెట్రో ప్రారంభోత్సవం ఉంటుందన్నారు.