బతుకమ్మ పండుగ ఎలా మొదలైంది...?

SMTV Desk 2017-09-18 16:47:26  bathukamma festival, Telangana

హైదరాబాద్, సెప్టెంబర్ 18 : ఒక్కొక్క పువ్వేసి చంద మామ.. ఒక జాము అయే చంద మామ.. రెండేసి పువ్వు తీసి చంద మామ... రెండు జాము లాయె చంద మామ.... అంటూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకుంటారు బతుకమ్మ పండుగ. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఏడాది దసరాకి 12 రోజులు ముందు మొదలై రెండు రోజుల ముందు ముగుస్తుంది. ఈ పండుగకు తెలంగాణ ఉద్యమంలో ఎంతో విశిష్ఠమైన పాత్ర ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ పండుగకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, తెలంగాణ అస్థిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతబ్ధాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో భాగంగా ఉదాహరణకు ఓ కథను తీసుకుంటే.. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో, మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు.. వారికి గుర్తుగా పూలను పేర్చి బతుకవమ్మా.. లేదా బతుకు అమ్మా... అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటల వెనుక ఉండే మర్మం ఇదే.. కావడంతో ఈ బతుకమ్మను ప్రతి ఏడాది తెలంగాణ ఆనవాయితీగా జరుపుకుంటారు. అయితే, తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు అని, చివరి రోజు సద్దుల బతుకమ్మ అని అంటారు. ఆనవాయితీ ప్రకారం ఈ సందర్భంగా ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి పుట్టింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం వాటి చుట్టూ పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న చెరువు, ఆలయ కోనేరులలో నిమజ్జనం చేస్తారు. అయితే చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా జరుగుతుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడు, గునుగు పూలను భారీగా సేకరిస్తారు. ఆ తరువాత ఇంటిల్లిపాది కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు, తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబాలం) లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు, పూలు పళ్లెం, తాంబాలంలో పేర్చుతారు, ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన పూలను పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రంగు రంగుల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుందని భావిస్తారు. తెల్లని గునుగు పూలను రంగులతో అద్ది, పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరమ్మ ను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి దీపాధూపాలతో పూజిస్తారు. ఆ రోజు సాయంకాలం ఆడపడుచులు అందరూ చక్కగా నూతన దుస్తూలు, అభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, సోదరభావం, ప్రేమను కలపి రంగరిస్తూ మానవ హారంగా ఏర్పడి పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టు పక్కలా ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. చీకటి పడుతుండగా, స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు, బతుకమ్మలతో అత్యంత సుందరంగా, కోలాహలంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ, జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్న తరువాత, మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ, ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత "మలీద" (చక్కెర మరియు రొట్టెతో చేసినది) అనే పిండి వంటకాన్ని బంధు మిత్రులకు పంచిపెడతారు. ఆ తరువాత ఖాళీ తాంబలంతో పాడుతూ, బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. దీంతో వెళ్లిరా బతుకమ్మ మళ్లీ రా బతుకమ్మ అంటూ తెలంగాణ ప్రజలు బతుకమ్మను సాగనంపుతారు.