భాగ్యనగర రహదారులకు మోక్షం.. విదేశీ తరహాలో రోడ్లు..

SMTV Desk 2017-09-18 14:07:10  White Topping Roads, Municipal secretary Naveen Mittal, Municipal minister ktr.

హైదరాబాద్, సెప్టెంబర్ 18 : హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ అస్థవ్యస్తంగా తయారయ్యాయి. రోడ్ల మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా అవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తున్నాయి. ప్రతి ఏటా భారీ వర్షాలకు రోడ్లు పాడవడం, ప్రభుత్వాలు మరమ్మత్తు చర్యలకు పూనుకోవడం జరుగుతూ వస్తుండడంతో తెలంగాణ పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ రహదారుల పునరుద్దీకరణకు శాశ్వత పరిష్కారం దిశగా ఒక సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. ఇకపై వేసిన రోడ్లు మళ్ళీ మరమ్మత్తులకు గురికాకుండా ఉండేలా వైట్ టాపింగ్ రోడ్లను వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు కొన్నిచోట్ల 8 వరుసలు, మరికొన్ని చోట్ల 6 వరుసల వైట్ టాపింగ్ రోడ్లను నిర్మించడానికి పక్కా ప్రణాళికను రచించారు. దీనికోసం ప్రభుత్వం రూ. 2 వేల కోట్లను ఖర్చు చేయనుంది. ఈ రహదారుల నిర్మాణంలో భాగంగా ప్రతి కిలోమీటరుకు దాదాపు రూ. 10 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. అసలు ఈ విస్తరణ పనుల కోసం ఒక ప్రత్యేక సంస్థ ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం, ప్రభుత్వం రహదారి అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి.. ఆ సంస్థకు ఎండీగా పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ ను నియమించింది. ఇప్పటికే ఈ సంస్థకు మంత్రి కేటీఆర్ రూ. 500 కోట్లను కేటాయించినా, మరో 1500 కోట్లను వివిధ బ్యాంకుల నుండి అప్పుగా తీసుకోవడానికి ఏర్పాట్లను చేశారు. ఈ వైట్ టాపింగ్ నిర్మాణంపై నివేదికను ఇచ్చే బాధ్యతను ఇప్పటికే ఒక సంస్థకు అప్పగించినట్లు సమాచారం. ఆ నివేదిక అందగానే నిర్మాణ పనులను మొదలుపెట్టనున్నారు. ఈ వైట్ టాపింగ్ రోడ్ల గురించి ఎండీ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ..."త్వరలోనే ఈ వైట్ టాపింగ్ రోడ్డు నిర్మాణాన్ని మొదలు పెట్టబోతున్నా౦. మంచి నైపుణ్యం కలిగిన గుత్తేదార్లకు మాత్రమే ఈ సంస్థను అప్పగించి వీటిని పూర్తి చేయాలనే యోచనలో ఉన్నా౦. ఈ రోడ్ల నిర్మాణం వల్ల వాహనదారులు వందేళ్ళ పాటు ఎలాంటి గుంతలు లేని సురక్షితమైన ప్రయాణం చేయొచ్చు" అని పేర్కొన్నారు. కాగా కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షాభావం వ్యక్తం చేస్తున్నారు. అసలు దీని వల్ల కలిగే ప్రయోజనం ఏంటి..? భవిష్యత్తును, ముందు తరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయానికి రావడం నిజంగా అభినందనీయ విషయం. అయితే ఎన్నో ఏళ్ళ క్రితమే సింగపూర్, లండన్, వాషింగ్టన్, వంటి నగరాల్లో ఈ వైట్ టాపింగ్ రోడ్లను నిర్మించారు. ఆధునాతన ప్రక్రియలో భాగంగా మన రాష్ట్రంలో రోడ్డుకు ఒకవైపు డక్ట్ ను నిర్మించి అందులో త్రాగునీరు, మురుగునీరు పైపులైన్లతో పాటు కేబుళ్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ లను నిర్మిస్తారు. వైట్ టాపింగ్ రోడ్లను ఒక ప్రత్యేకమైన సిమెంట్ తో నిర్మిస్తారు కాబట్టి సుమారు వందేళ్ళ పాటు చెక్కు చెదరకుండా మన్నుతాయని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల మాటి మాటికీ రోడ్లు మరమ్మత్తులకు గురయ్యే అవకాశం ఉండదు.