రేవంత్ రెడ్డి కి ఫోన్ చేసి దొరికి పోయాడు

SMTV Desk 2017-06-05 16:52:14  TDP,MLA, Revanthreddy,Kirankumarreddy.CM

హైదరాబాద్, జూన్ 5 : హైదరాబాద్‌లో ఓ ఘరానా మోసగాడి గుట్టు రట్టయింది. ఏకంగా రాజకీయనేతలనే బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించిన మోసగాడిని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పోలీసులకు పట్టించారు. ఫైనాన్స్ సెక్రటరీ పేరుతో పలువురు రాజకీయ నాయకులకు ఫోన్లు చేసి ప్రధాన మంత్రి ఎంప్లాయి‌మెంట్ గ్యారెంటీ పథకం కింద కేంద్రం నుంచి భారీ మొత్తంలో నిధులు విడుదలవుతున్నాయని నమ్మబలికాడు. ‘‘మీరంటే నాకు అభిమానం.. మీ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఇప్పించాం. మీరు కొంత నగదు ఇస్తే ఆ నిధులను విడుదల చేయిస్తా.’’ అంటూ ఎమ్మెల్యేలను నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరకు రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి.. పోలీసులకు దొరికిపోయాడు. జూబ్లీహిల్స్ పోలీసులు అతడిని వలపన్ని పట్టుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బాలాజీ..దేవరకుమార్ పేరుతో నేతలకు ఫోన్లు చేసి మోసం చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. లక్షా 25 వేలు డిపాజిట్ చేస్తే.. రెండు కోట్ల రూపాయల నిధులు వస్తాయని నమ్మించాడని పోలీసులు తెలిపారు. నిన్న రాత్రి 8 గంటలకు అతడి అనుచరుడైన అంకుష్‌ను అరెస్టు చేశామని, అతడి ద్వారా ఘరానా మోసగాడు బాలాజీని ఆలేరుకు రప్పించామని, అక్కడ పకడ్బందీగా ప్లాన్ వేసి అదుపులోకి తీసుకున్నామని జూబ్లీహిల్స్ పోలీసులు వివరించారు. బాలాజీపై ఇటు తెలంగాణలోనూ.. అటు ఏపీలోనూ చాలా కేసులున్నాయని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు. 2013 నవంబర్ 1న సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసినట్లు రికార్డుల్లో ఉందని చెప్పారు. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలాజీ ఇలాంటి మోసాలు చాలా చేసినట్లు విచారణలో తెలిసిందని, తాజాగా ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, పొంగులేటిలకు ఫోన్ చేసి డబ్బులు గుంజాడని, చివరిగా రేవంత్‌కు ఫోన్ చేస్తే.. ఆయన పీఏ తమకు సమాచారం ఇవ్వడంతో అతడి గుట్టు బట్టబయలైందని పోలీసులు పేర్కొన్నారు.