సినిమా పిచ్చి ఆమెను వ్యభిచార కూపంలోకి నెట్టింది.. అసలేం జరిగింది..?

SMTV Desk 2017-09-11 15:11:46  cinema chance, cinema froud, cinema crime

హైదరాబాద్ సెప్టెంబర్ 11: కొంత మంది అమ్మాయిలకు సినిమాల్లో చేరాలని, మంచి నటిగా గుర్తింపు పొందాలనే ఉంటుంది. అయితే అందంగా ఉండడమో, సన్నిహితులు అలా ప్రేరేపించడమో తెలియదు గానీ, కొంత మంది అమ్మాయిలకు హీరోయిన్ అయిపోవాలనే కోరిక బలంగా పాతుకుపోతుంది. అయితే ఇలాంటి ఆలోచన ఉన్న వారినే టార్గెట్ చేస్తూ సిటీలో కొన్ని ముఠాలు కొత్త అవతారాన్ని ఎత్తుతున్నాయి. అలాంటి వారిని కనిపెట్టి వారికి సినిమాల్లో అవకాశం కల్పిస్తామని నమ్మబలికి వారిని అందమైన దుస్తుల్లో ఫోటోలు తీసి వాటిని ముందుగానే ఎంచుకున్న కొంతమంది యువకులకు చేరవేసి వారిని వ్యభిచార కూపంలోకి నెడుతున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే నేడు హైదరాబాద్ లో చోటు చేసుకుంది. యూసుఫ్‌ గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌ నగర్‌ లో నాగభాస్కర్‌ అలియాస్‌ విక్కి కొంత కాలంగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. అందులో అతని అసిస్టెంట్లుగా పి.సాయి దుర్గాప్రసాద్‌ అలియాస్‌ కార్తీక్, పి.ధర్మ పని చేస్తున్నారు. వీరి పని ఏంటంటే హీరోయిన్ కావాలని ఆశ ఉండి అందుకు తగ్గ ఆర్ధిక స్తోమత లేని అమ్మాయిలను వెతికి పట్టుకొని వారి ఫోటోలు తీసి వారిని వ్యభిచార కూపంలోకి నెడుతున్నారు. ఈ ముఠా నేడు పోలీసులకు చిక్కడంతో వారి ఆగడాలు బయటపడ్డాయి. ఇప్పటివరకు ఇలాంటి ముఠాల కోరల్లో కొన్ని వేల మంది అమ్మాయిలు వ్యభిచార కూపంలో చిక్కుకొని నరకయాతన అనుభవిస్తున్నారు. ఇలాంటి ముఠాల పట్ల యువతులు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సన్నిహితుల ప్రేరణ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఉన్నత చదువుల పట్ల యువత శ్రద్ధ చూపాలని, ఆకర్షణకు లోనై తమ విలువైన జీవితాలను కోల్పోవద్దని పోలీసులు సూచించారు.