హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టారా ?

SMTV Desk 2019-10-19 14:41:22  

హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ ప్రకారం ఇవాళ ఉదయం పదిన్నరకు ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు మొదలుపెడుతుందా ? అంటే అది డౌటనుమానంగానే మారింది. రెండు వారాలుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ జేఏసీ ఇవాళ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని హైకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళుతుందన్నది ఉత్కంఠగా మారింది. అటు కార్మికులు, ఇటు ప్రభుత్వం బెట్టువీడకపోవడం, మెట్టుదిగకపోవడంతో హైకోర్టు జోక్యం చేసుకుని కీలక ఆదేశాలు జారీ చేసింది. జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు ఆర్టీసీకి చెందిన రెండు యూనియన్లతో చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కార్మికుల డిమాండ్లపై స్పందించి మూడు రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసింది. చర్చల వివరాలను 28లోగాతమకు చెప్పాలని ఆదేశించింది హైకోర్టు. చర్చల కోసం రెండు సార్లు ప్రభుత్వ వర్గాలను సంప్రదించినా స్పందన లేదని ఆర్టీసీ జేఏసీ వాదించింది. ప్రభుత్వంలో విలీనం చేస్తే తప్ప చర్చలు జరపమని తాము ఎప్పుడూ చెప్పలేదని కోర్టుకు తెలిపింది. కార్మిక సంఘాలతో ఎందుకు చర్చలు చేపట్టలేదని... ఆర్టీసీ కి ఎండీని ఎందుకు నియమించలేదని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తండ్రి పాత్ర పోషించాలని, కార్మికులకు ఆరోగ్య శ్రీ కార్డులివ్వడానికి ఇబ్బంది ఏంటని ప్రభుత్వాన్ని అడిగింది హైకోర్టు. కార్మికులు సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని సూచించిన కోర్టు.. 45 డిమాండ్లలో 20 సులువుగా పరిష్కారం అయ్యేవేనని అభిప్రాయపడింది. సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో న్యాయస్థానం కూడా అసంతృప్తితో ఉంది. ఇలాంటి సమయంలో సమ్మె చర్చలకు వస్తుందా... రెండు పక్షాలు సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరిస్తాయా అన్నది ఉత్కంఠగా మారింది.