ప్రభుత్వాదాయం ఎందుకు పడిపోయింది?

SMTV Desk 2019-10-17 15:05:54  

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రొఫెసర్ కోదండరాం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆర్టీసీ నష్టాల్లో ఉందంటూ పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ సంవత్సరం ప్రభుత్వాదాయం ఎందుకు పడిపోయిందో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారని సీఎంపై మండిపడ్డారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రభుత్వంపై ఉద్యోగులు యుద్ధానికి సిద్ధమవుతున్నారని కోదండరాం ఈ సందర్భంగా వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కేసీఆర్ తప్ప ఎవరూ కారణం కాదన్నారు. కార్మికుల సమ్మె విజయవంతమయ్యేందుకు తెలంగాణ సమాజం మొత్తం అండగా నిలుస్తుందన్నారు. కేసీఆర్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం మొత్తం ఏకమవుతోందన్నారు. ‘ఆంధ్రా పాలకులను తరిమికొట్టిన మనకు కేసీఆర్ మెడలు వంచడం పెద్ద పనేం కాదు’ అని పేర్కొన్నారు. పంతొమ్మిదిన రాష్ట్ర బంద్‌కు అందరూ సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.