జీతానికి న్యాయం చేయండి లేదా బదిలీ అవ్వండి : కలెక్టర్ యోగితా రాణా

SMTV Desk 2017-08-23 15:50:41  COLLECTOR YOGITHA RANA, EDUCATIONAL SYSTEM, REVENUE SYSTEM, ENGINEERING SYSTEM

హైదరాబాద్, ఆగస్ట్ 23 : ఇటీవలే బదిలీపై హైదరాబాద్ నగరానికి వచ్చిన కలెక్టర్ యోగితా రాణా రావడంతోనే విద్యా వ్యవస్థ, ఆపై రెవెన్యూ శాఖలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈమె తీసుకున్న సరికొత్త నిర్ణయాల వల్ల అధికారులలో గుబులు మొదలవుతోంది. ఉద్యోగుల పని తీరును మెరుగు పరిచేందుకు నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచించారు. ఈ క్రమంలో కలెక్టర్ యోగితా ఇంజినీరింగ్ పనులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. పని తీరును మార్చుకోమంటూ ఆదేశాలు జారీ చేసారు. సర్వశిక్షా అభియాన్ ఇంజినీరింగ్ పనుల సమీక్షలో పాల్గొన్న ఆమె.. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టే వివిధ పనుల కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్నా నిర్లక్ష్యం వహించడం పట్ల తీవ్ర౦గా స్పందించారు. "ఎన్ని నిధులు సమకూర్చిన కూడా నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయండి. అలా కుదరకపోతే బదిలీ చేయించుకొని వెళ్ళిపో౦డ౦టూ" తనదైన రీతిలో హెచ్చరించారు. ఒక లక్ష, రెండు లక్షలతో చేపట్టే చిన్న చిన్న పనులను కూడా టెండర్ల సాకులు చెబుతూ పూర్తి చేయకపోవడం ఇంజినీర్ల నిర్లక్ష్యానికి నిదర్శనం అంటూ వ్యాఖ్యానించారు. ఇక నుంచి చేసే పనికి సాకులు చెప్పి కాలయాపన చేస్తే సహించేది లేదంటూ చెప్పేశారు. ఆ పనులను అగ్రిమెంట్ చేసుకునే ముందుగానే వాటిని ఎంత సమయంలో పూర్తి చేస్తారో ఖచ్చితంగా పేర్కొని ఇచ్చిన సమయంలోనే పూర్తి చేయాలన్నారు. 144 అదనపు గదుల పనులను సెప్టెంబర్ లోగా పూర్తి చేయాలని, ఇప్పటి వరకు టెండర్లకు ఆహ్వానించని పనులకు వెంటనే టెండర్లను పిలవాలని సూచించారు. కోర్టు కేసుల కారణంగా ఏవైనా పనులు ఆగిపోతే వాటి వివరాలను సంబంధిత తహశీల్దార్ లకు అందించాలి. అంతేకాకుండా విద్యా శాఖకు సంబంధించిన పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డిప్యూటీ కలెక్టర్ సరళా వందనానికి సూచించారు.