ప్రేమ వివాహం...ఆ తరువాత ఆత్మ హత్య చేసుకున్న నవదంపతులు

SMTV Desk 2019-04-17 15:36:26  lovers suicide, lovers selfie video, lovers death

చిత్తూరు, ఏప్రిల్ 17: కులాలు వేరైన యువతీ యువకులు, ప్రేమించుకుని, ఇంట్లో నుంచి పారిపోయి, వివాహం చేసుకున్న గంటల వ్యవధిలోనే, తాము చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసి, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. తమ మరణంతోనైనా పెద్దల బుద్ధి మారాలంటూ వీరు రికార్డ్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారంం శ్రీకాళహస్తికి చెందిన రవిబాబు, సుమతిల కుమార్తె పల్లవి (16), చంద్రగిరి సమీపంలోని మొరవపల్లె ఎస్సీ కాలనీకి చెందిన దొరసామయ్య కుమారుడు ధనంజయులు (20) మధ్య ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరిద్దరూ, ఓ దేవాలయంలో వివాహం చేసుకుని, ఆపై తాము ఆత్మహత్య చేసుకోబోతున్నామని వీడియో తీసుకుని, తెల్లవారుజామున మొరవపల్లె సమీపంలో రైలు కింద పడ్డారు.

ధనుంజయులు మృతదేహాన్ని స్థానికులు గుర్తు పట్టగా, విషయం తెలుసుకున్న పోలీసులు, ఆ యువతిని శ్రీకాళహస్తిలో మిస్సింగ్ కేసుగా నమోదైన పల్లవిగా గుర్తించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యలపై కేసు నమోదు చేశామని, విచారణ ప్రారంభించామని తెలిపారు.

తమకు పెళ్లయిందని, విడిపోయి ఉండలేక, చనిపోతున్నామని చెబుతూ వీరు మాట్లాడిన మాటల వీడియోను చూసిన వారంతా కన్నీరు కారుస్తున్నారు. కాగా, ఇటీవలే ఇంటర్ ఫలితాలు వెల్లడికాగా, రెండు పరీక్షల్లో పల్లవి తప్పిందని, ఆ కారణంతోనే ఇల్లు వదిలి వెళ్లిందని భావించామని, ఇంత పని చేస్తుందని అనుకోలేదని పల్లవి తల్లిదండ్రులు బోరున విలపించారు.