రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

SMTV Desk 2019-04-09 11:50:48  loksabha elections, central election commission of india, local elections

హైదరాబాద్: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల తరువాత నిర్వహించనున్న స్థానిక సంస్థలైన మున్సిపాలిటీ, మండల, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల అనంతరం ఎప్పుడైనా ఈ ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖరాసింది. ఏప్రిల్ 11న రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్చి 13, 22 తేదీల్లో కేంద్ర ఎన్నికలసంఘానికి లేఖలు రాసింది. స్థానిక ఎన్నికలకు ఏ విధంగా ఏర్పాట్లు చేయనున్నదీ ఆ లేఖల్లో వివరించింది. అన్నింటినీ పరిశీలించిన కేంద్ర ఎన్నికలసంఘం.. ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత మున్సిపాలిటీలు, మండల, జిల్లా ప్రజాపరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదని తెలిపింది. ఫలితాలను మాత్రం పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే విడుదలచేయాలని స్పష్టంచేసింది.