ఆ ప్రకటనల ఉద్దేశ్యం ఏమిటంటే...

SMTV Desk 2019-04-01 17:34:35  KCR,

సిఎం కేసీఆర్‌ నిన్న ఎన్నికల ప్రచారసభలలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాల గురించి ఇతర రాష్ట్రాలలో పత్రికలలో ప్రకటనలు ఇస్తున్నామని, వాటిని చూసి ఆయా రాష్ట్రాల ప్రజలు తమ రాష్ట్రాలలో కూడా అటువంటి పధకాలను అమలుచేయాలని కోరుతున్నారని సిఎం కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణలో పోలీసులకు 30 శాతం అలవెన్సులు ఇస్తున్నామని తెలుసుకొని మహారాష్ట్ర పోలీసులు తమకు కూడా అలవెన్సులు ఇవ్వాలని మహరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారని కేసీఆర్‌ అన్నారు.

తెలంగాణ సంక్షేమ పధకాల ప్రభావం కేంద్రప్రభుత్వంతో సహా దేశంలో వివిద రాష్ట్రాలపై పడిందన్న మాట వాస్తవం. కానీ వాటి గురించి ఇతర రాష్ట్రాలలో పత్రికలలో ప్రకటనలు ఇవ్వడంపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. కేసీఆర్‌ కేవలం ప్రచారయావతోనే కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేస్తూ పత్రికా ప్రతికటనలు ఇచ్చుకొంటున్నారని విమర్శించాయి తప్ప వాటి వెనుక సిఎం కేసీఆర్‌ ఆంతర్యం గ్రహించినట్లు లేవు.

ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ పధకాలకు...వాటికి రూపకల్పన చేసి అమలుచేస్తున్న సిఎం కేసీఆర్‌కు స్వీయప్రచారం చేసుకొంటున్న మాట వాస్తవం. కానీ తెలంగాణకే పరిమితమైన కేసీఆర్‌ ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేసుకోవడం ఏమి ప్రయోజనం? అని ఆలోచిస్తే సిఎం కేసీఆర్‌ చాలా దూరదృష్టితో తన వ్యూహాన్ని పకడ్బందీగా అమలుచేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. కేసీఆర్‌ ప్రధానమంత్రి పదవి చేపట్టాలనుకొంటున్న సంగతి ఇప్పుడిప్పుడే తెరాస నేతల మాటల ద్వారా మెల్లగా బయటకువస్తోంది. అంటే కేసీఆర్‌ తన కలను సాకారం చేసుకొనే ప్రయత్నంలోనే పత్రికా ప్రకటనలు ఇస్తున్నట్లు భావించవచ్చు.

వాటి ద్వారా వివిద రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకొని వారి మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తి చెంది ఏవిధంగా అసెంబ్లీ ఎన్నికలలో తెరాసను గెలిపించారో, లోక్‌సభ ఎన్నికల తరువాత దేశప్రజలు కూడా కేసీఆర్‌ నాయకత్వాన్ని అంగీకరించేలా చేయడం ఆ ప్రచార ప్రకటనల ముఖ్యోదేశ్యంగా కనిపిస్తోంది. కేసీఆర్‌ నాయకత్వంలో ఏర్పాటవుతున్న ఫెడరల్‌ ఫ్రంట్‌లోకి ప్రాంతీయపార్టీలను ఆకర్షించాలనే ఆలోచన కూడా ఇమిడి ఉన్నట్లు కనిపిస్తోంది.

మరి ప్రధానిగా దేశాన్ని పాలించాలనే కేసీఆర్‌ కలలు నిజమవుతాయో లేదో? ఉత్తరాది ప్రజలు, ప్రాంతీయ పార్టీలు కేసీఆర్‌ నాయకత్వాన్ని అంగీకరిస్తారో లేదో లోక్‌సభ ఎన్నికల తరువాత తెలుస్తుంది.