రైల్వే స్టేషన్ల అభివృద్ధి గూర్చి దత్తాత్రేయ

SMTV Desk 2017-08-13 15:12:23  bandaru dattatreya, mmts services, yadadri, secundrabad railway station

హైదరాబాద్, ఆగస్ట్ 13 : కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రైల్వే, హౌసింగ్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌, విద్య తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కోరినన్ని ఇళ్ళను కేటాయించడానికి సిద్దంగా ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి 1,51,155 ఇళ్లను కేంద్రం మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 40 వేల ఇళ్లను మాత్రమే ప్రారంభించిందని చెప్పారు. కాగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించినట్టు తెలిపారు. ఎంఎంటీఎస్‌ సేవలను యాదాద్రి వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ముంబయి, కరీంనగర్‌ మధ్య కొత్త రైలును కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలిపారు. కాజీపేటలో వ్యాగన్‌ ఫ్యాక్టరీకి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చితే త్వరలోనే ఆ ప్రాజెక్టు కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మరింత పెంచే అవసరం ఉందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత అధికంగా ఉందంటూ ఈ విషయంపై త్వరలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి లక్ష్మారెడ్డితో భేటీ అవుతానని దత్తాత్రేయ తెలిపారు.