మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం 'సైబర్‌ రక్షక్‌'

SMTV Desk 2019-03-19 12:43:50  cyber rakshak, she teams, cyberabad police, dgp mahender reddy

హైదరాబాద్‌, మార్చ్ 18: మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ప్రత్యేకంగా సైబర్‌ రక్షక్‌ను ప్రారంభిస్తున్నామని డీజీపీ మహెందర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమెన్‌ సేఫ్టీవింగ్‌ అధికారి స్వాతిలక్రా, జస్టిస్‌ ఈశ్వరయ్య, ఐటీ ఉద్యోగినులు, పలు కాలేజీల విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి షీ టీమ్స్‌ను ప్రారంభించింది. ఐదేళ్లుగా హైదరాబాద్‌ భద్రత గల నగరంగా దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. షీ టీమ్స్‌కు సమాచారం ఇస్తే ఫిర్యాదు లేకుండానే ఆకతాయిలపై చర్యలు తీసుకుంటుంది. స్వచ్చంద సంస్థలు, ఐటీ డిపార్ట్‌మెంట్‌ సహకారంతో మహిళల భద్రత కోసం సైబర్‌ రక్షక్‌ను ప్రారంభిస్తున్నాం. సైబర్‌ నేరాల బాధితులను తగ్గించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఆన్‌లైన్‌ భద్రత, ఫేక్‌ మ్యాపులు అరికట్టడంలో శిక్షణ ఇచ్చాం. డిజిటల్‌ సేఫ్టీపై అవగాహన తరగతులు నిర్వహించాం. సైబర్‌ రక్షక్‌లో భాగంగా శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తున్నాం. ఆన్‌లైన్‌ మోసాల బారిన పడకుండా చూడటమే మా లక్ష్యమని, యువత సెల్‌ఫోన్లకు బానిస కాకుండా కూడా చూడాలనేది మా ఆశయం అని అన్నారు.