బాసర అమ్మవారి విగ్రహం ఏమైనట్టు?

SMTV Desk 2017-08-09 11:15:00  basar, idol, saraswati temple

బాసర, ఆగస్ట్ 09: బాసర లో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పొలిమేర దాటించారనే కేసు లో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. విగ్రహాన్ని ఎవరు ఎందుకు మాయం చేసారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఓ వైపు అమ్మవారి విగ్రహం కనిపించటం లేదు. . మరో వైపు విగ్రహ తరలింపులో కీలకంగా మారిన ప్రధాన అర్చకుడు సంజీవ్ కుమార్ అజ్ఞాతం లోకి వెళ్ళారు. అయన కోసం అన్వేషిస్తున్న తరుణం లో మరో సంచలనం తెర పైకి వచ్చింది. బడిలో పిల్లల సంఖ్య ఫీజుల రాబడి పెంచుకునేందుకు ప్రైవేట్ స్కూళ్ల మాయాజాలం బాసర కిరికిరి కి ఊతమిచ్చింది. అమ్మవారి విగ్రహాన్ని తెప్పించి పేరెంట్స్ ను ఆకట్టుకోవలనుకున్న దేవరకొండ లోని రెండు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు బాసర ప్రధాన అర్చకుడు సంజీవ్ కుమార్ తో డీల్ కుదుర్చుకున్నారు. పైకానికి కక్కుర్తి పడిన అర్చకుడు మరో రుత్వికుడితో కలిసి అమ్మవారి విగ్రహాన్ని దేవరకొండకు తరలించారని ఆరోపణలు వచ్చాయి. అయితే దేవరకొండ లో పూజలు చేసిన మాట నిజమే కాని అమ్మవారి విగ్రహాన్ని తీసుకు వెళ్ళలేదు, ఆక్కడ అక్షరాభ్యాసం నిర్వహించలేదని సంజీవ్ కుమార్ వివరణ కూడా ఇచ్చారు. అయితే, విగ్రహాం కనిపించకుండా పోవడం, అర్చకుడికి గుండెపోటు వచ్చి అజ్ఞాతం లోకి వెళ్ళడం రెండు ఒకేసారి జరగడంతో దేవాదాయ శాఖ కూడా ఈ వ్యవహారం పై సీరియస్ గానే దృష్టి సారించింది. సంజీవ్ కుమార్ కు ఉత్సవ విగ్రహాన్ని అప్పగించినట్టు స్టోర్ ఇంచార్జ్ సుశీల స్పష్టం చేయడంతో పలు అనుమానాలకు దారి తీసింది. అసలు ట్విస్ట్ ఎంటంటే, బాసర సరస్వతి ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ కుమార్ కు గుండెపోటు వచ్చిందంటూ నిజామాబాద్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. తాను ఏ తప్పు చెయ్యలేదంటున్న సంజీవ్ కుమార్ విచారణకి సహకరిస్తానని స్పష్టం చేసారు.