తెలంగాణ పథకాలకు ప్రశంసలే తప్ప ఇంకేం లేవు : కేటీఆర్

SMTV Desk 2019-03-08 18:01:26  trs, ktr, kcr, raithubandhu scheme, central government

మెదక్‌, మార్చ్ 08: మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పుడు చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. అలాగే రైతులకు మేలు చేసే పథకాలను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమైనా చేసిందా అని ప్రశ్నించారు. తాము ప్రవేశపెట్టిన రైతు బంధు పతాకాన్ని కేంద్ర స్థాయిలో కాపీ కొడుతున్నారని అన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు కూడా రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టాడు, మోదీ కూడా కేసీఆర్‌ ను చూసి.. పీఎం కిసాన్‌ యోజన తీసుకొచ్చాడని గుర్తు చేశారు. తెలంగాణ పథకాలకు కేంద్రం నుంచి ప్రశంసలే తప్ప.. నిధులు రాలేదన్నారు. మిషన్‌ కాకతీయ, భగీరథకు నిధులు ఇవ్వాలని నీతిఆయోగ్‌ ఎన్ని సిఫారసులు చేసినా.. కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కాబట్టి మనమే 16ఎంపీ స్థానలు గెలిస్తే ..మనం కేంద్రాన్ని యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వస్తామన్నారు. అపుడు నిధులు తన్నుకుంటూ వరదలా వస్తాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. మోదీని గెలిపిస్తే ప్రజలకు ఆయన చేసిందేమీ లేదు.. మోదీ నోట్ల రద్దు చేసి అందరి ఆడవారి పోపుల డబ్బాల ఖాళీ చేయడం తప్ప అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని అడిగితే ముసిముసి నవ్వులు నవ్వి ఊరుకున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి ఎన్నికల్లో గెలుపు ఏకపక్షమేనని కేటీఆర్‌ అన్నారు. పోటీ పార్టీల మధ్య కాదు మా అభ్యర్థుల మధ్యే.. వారు సాధించే మెజార్టీ మధ్యేనని కేటీఆర్‌ చెప్పారు.