ఈ ముఖ్యమంత్రి కింద నేను పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్న : కేటీఆర్

SMTV Desk 2019-03-07 18:24:37  ktr, kcr, trs, warangal, narendra modi, chandrababu, tdp, bjp

వరంగల్‌, మార్చ్ 07: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరగంల్‌లోని ఓసిటీ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సభలో కేటీఆర్ ప్రసంగిస్తూ...దేశం మొత్తం ఇవాళ తెలంగాణ వైపు చూస్తోందని. అలాగే ఒకానొక సమయంలో ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ తనతో మాట్లాడుతూ ఒక ఆందోళనకారుడు ఒక అద్భుతమైన పరిపాలనాదక్షకుడిగా రూపాంతరం చెందుతున్నారని చెప్పినట్లు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రైతుల గురించి ఆలోచించి, వారి కష్టాలను ఆకలింపు చేసుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనన్నారు. అందుకు నిదర్శనంగానే రైతు బంధు పథకం ద్వారా రైతులకు అండగా నిలబడుతున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా విధి లేని పరిస్థితుల్లో రైతుబంధును కాపీ కొట్టి ‘‘అన్నదాత సుఖీభవ’’ అనే పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. చివరికి దేశ ప్రధాని నరేంద్రమోడీ సైతం ‘‘పీఎం కిసాన్’’ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. మనకోసం కేసీఆర్ ఉన్నారని జయశంకర్ అన్నారని కేటీఆర్ చెప్పారు. ఈ ముఖ్యమంత్రి కింద నేను పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీలైన రోజులు ఎన్నో ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ రాజముద్రలో చేర్పించి వరంగల్ జిల్లాకు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చారని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ తర్వాత వరంగల్‌ అభివృద్ధికి కేసీఆర్ పలు ప్రణాళికలు రూపొందిస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. లింగంపల్లి రిజర్వాయర్ ద్వారా దేవాదుల నుంచి అత్యధిక స్థాయిలో సాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్నామన్నారు. రైతు మరణిస్తే... అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.5 లక్షల రైతు బీమా అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనన్నారు. రూ.80 వేల కోట్ల రూపాయల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చినట్లు... కాళేశ్వరానికి లేదా పాలమూరు-ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్.. ప్రధానిని సభాముఖంగా అడిగారని కానీ ఆయన పట్టించుకోలేదన్నారు.