స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లి చెరువులో పడి నలుగురు యువకులు మృతి....

SMTV Desk 2019-02-27 21:12:51  Suryapet district, Kodad, Anurag engineering college, Students died at friend birthday party

కోదాడ, ఫిబ్రవరి 27: సూర్యాపేట జిల్లా కోదాడలో విషాద సంఘటన చోటు చేసుకుంది. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి నలుగురు ఇంజీనీరింగ్ విద్యార్థులు ప్రాణాలువిడిచారు. స్థానికుల వివరాల ప్రకారం....అనురాగ్ ఇంజనీరిగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిది ఇవాళ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతని స్నేహితులకు కోదాడ పట్టణ శివారులోని పెద్ద చెరువు వద్ద సరదాగా పార్టీ ఏర్పాటు చేశాడు. అక్కడే కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఈ వేడుకకు వచ్చిన ప్రవీణ్, సమీర్, భవాని ప్రసాద్, మహేందర్ అనే విద్యార్థులు పార్టీ తర్వాత చేతులు కడుక్కోడానికి చెరువులోకి దిగారు. ప్రమాదవశాత్తు చెరువులో పడిన వీరికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతిచెందారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. వాటిని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం కాలేజికని వెళ్లిన పిల్లలు ఇలా విగతజీవులుగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.