చందానగర్ లో ఆర్టీసి బస్సు విధ్వంసం...

SMTV Desk 2019-02-27 16:54:51  Chandanagar RTC Bus accident, RTC Bus driver, heart attack

రంగారెడ్డి, ఫిబ్రవరి 27: రంగారెడ్డి జిల్లా చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు విధ్వంసం సృష్టించింది. బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి పార్కింగ్‌లో ఉన్న ఒక ఆటో, మూడు కార్లను ఢీకొట్టిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ మృతి చెందారు. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాణిగంజ్‌ డిపో–1కు చెందిన ఏపీ29జడ్‌3560 219 నంబరు బస్సు పటాన్‌చెరు నుంచి సికింద్రాబాద్‌కు 45 మంది ప్రయాణికులతో వెళ్తుండగా మార్గమధ్యంలో చందానగర్‌ ఆర్‌.ఎస్‌.బ్రదర్స్, మలబార్‌ గోల్డ్‌ ముందుకురాగానే డ్రైవర్‌ మల్లారెడ్డికి గుండెనొప్పి రావడంతో బస్సు అదుపుతప్పి మొదట ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న డ్రైవర్‌ పక్కకు దూకేశాడు. ఆ తర్వాత పార్కింగ్‌ చేసి ఉన్న మూడు కార్లను బస్సు ఢీ కొట్టింది. ఇందులో రెండు కార్లు, ఓ ఆటో పూర్తిగా ధ్వంసం కాగా మరో కారు స్వల్పంగా దెబ్బతింది. శైలజ అనే బస్సు ప్రయాణికురాలికి స్వల్పగాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. మిగతావారంతా క్షేమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.