596 వెబ్‌సైట్లను బ్లాక్ చేసిన ప్రభుత్వం

SMTV Desk 2017-08-03 18:31:07  596 web sites banned

హైదరాబాద్, ఆగష్టు 3 : యువతను తప్పుదారి పట్టిస్తున్న 596 వెబ్‌సైట్‌లను, 735 సోషల్ మీడియా లింక్‌లను బ్లాక్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాక వీటిలో దేశ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తున్న వెబ్‌సైట్లు, లింకులు కూడా ఉన్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ సహాయ మంత్రి పీపీ చౌదరి తెలిపారు. వివిధ కోర్టుల ఆదేశానుసారం ఈ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేశామని మంత్రి లోక్‌సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. మారుతున్న సాంకేతికతకు అవధులు లేకపోవడంతో చాలా మంది అనైతిక కార్యకలాపాలకు పాటుపడుతున్నారని, వారి మీద ప్రభుత్వం నిఘా ఉంచిందని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అలాగే గ్రామీణ డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి గ్రామీణ డిజిటల్ సాక్షర్త అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని కోసం ప్రభుత్వం 2,351.38 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నట్లు మంత్రి పీపీ చౌద‌రి తెలియజేశారు.