మా పెళ్ళికి పెద్ద నువ్వే అన్న...డిప్యూటి స్పీకర్‌తో బాల్క సుమన్

SMTV Desk 2019-02-25 18:51:13  Balka suman, TRS, Chennur constituency MLA, Deputy speaker of telangana assembly, Secundrabad MLA Padmaravu goud

హైదరాబాద్, ఫిబ్రవరి 25: నేడు జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిని స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సభ్యులందరూ పద్మారావుకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయనతో సాన్నిహిత్యం కలిగిన నాయకులు తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాల్క సుమన్ తన ప్రేమ పెళ్లికి పద్మారావు గౌడ్ ఎలా సహకరించారో వివరించారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అసెంబ్లీలో మాట్లాడుతూ మొదట డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన పద్మారావు గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత తన ప్రేమకు పద్మారావు గౌడ్ ఎలా సహకరించారో సుమన్ వివరించారు.

ఈ విషయం గురించి అసెంబ్లీలో మాట్లాడాలో లేదో నాకు తెలీదు. కానీ పద్మారావు గౌడ్ అన్నతో నాకున్న అనుబంధాన్ని తెలియజేయడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు. ఉద్యమ సమయంలో నేను టీఆర్ఎస్‌‌వి అధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకున్నా. అయితే మా ఇద్దరి కులాలు వేరు కావడమే కాకుండా నాకంటూ ఏదీ లేకపోవడంతో అత్తామామలు వారి కూతురినిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు. అయితే వారు అన్న(పద్మారావు గౌడ్) సామాజిక వర్గానికి చెందినవారే. ఈ విషయం గురించి తెలుసుకున్న అన్న మా అత్తామామలతో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. సుమన్ వద్ద ఇప్పుడు ఏమీ లేకపోవచ్చు కానీ భవిష్యత్ లో అతడు ఎమ్మెల్యే అవడం ఖాయమని చెప్పడంతో వారు పెళ్లికి ఒప్పుకున్నారు. అంటూ సుమన్ తన లవ్ స్టోరీ గురించి ప్రసంగించారు. ఇలా తనపై నమ్మకంతో అత్తామామలను ఒప్పించడమే కాకుండా వివాహానికి అన్నీ తానే ముందు నిలిచారని సుమన్ గుర్తుచేశారు. ఆయన వల్లే తమ ప్రేమ పెళ్లిగా మారి ఇప్పుడు ఆనందంగా వుంటున్నామని సుమన్ పేర్కొన్నారు.