ఫిబ్రవరి 5 నుండి ఎలక్ట్రిక్‌ బస్సుల ప్రారంభం

SMTV Desk 2019-02-03 11:15:23  Electric Buses

హైదరాబాద్, ఫిబ్రవరి 3: వాతావరణంలో కాలుష్యం రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా వాహనాల వలన వాయు కాలుష్యం మరింత పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 5 నుండి ఎలక్ట్రిక్‌ బస్సులు హైదరాబాద్ నగరంలో తిరగనున్నాయి. దీనికి సంబందించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసారు. దీంతో దేశంలో ప్రజా రవాణాలో మొదటగా ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపిన ఘనత హైదరాబాద్‌కు దక్కనుంది.

కేంద్రం మొత్తం 100 బస్సులను కేటాయించగా, మొదటి విడతగా 40 బస్సులు హైదరాబాద్‌ చేరుకున్నాయి. ఈ 40 బస్సులలో మియాపూర్‌-2 డిపోకు 20, కంటోన్మెంట్‌ డిపోకు 20 బస్సులను కేటాయించారు. మొదటగా మియాపూర్‌-2 డిపోలో ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభించి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి నడపనున్నారు. తరువాత కంటోన్మెంట్‌ డిపో నుంచి ప్రారంభించనున్నారు. ప్రతి 20 నుంచి 30 నిమిషాలకు విమానాశ్రయానికి బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతం శంషాబాద్‌ విమానాశ్రయానికి నడుస్తున్న మెట్రో లగ్జరీ బస్సుల స్థానాల్లో ఈ ఎలక్ట్రిక్‌ బస్సులు నడపనున్నారు. ఈ ఎలక్ట్రిక్‌ బస్సులో సుమారు 40 మంది వరకు ప్రయాణించొచ్చు.