నాగార్జున్ సాగర్ లో ఎయిర్ బోట్స్

SMTV Desk 2019-01-29 16:23:23  Nagarjun Sagar, Vijayawada, Hussain Sagar, Hyderabad, Air services

హైదరాబాద్, జనవరి 29: త్వరలో నాగార్జున్ సాగర్-హైదరాబాద్‌, సాగర్-విజయవాడలకు విమానాలు తిరుగనున్నాయి. అవికూడా సాగర్ జలాలపై నుంచి టేకాఫ్ తీసుకొనే ఎయిర్ బోట్స్ కావడం విశేషం. ఉడాన్(ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పధకంలో భాగంగా దేశవ్యాప్తంగా 225 మార్గాలలో విమానాలను, 16 మార్గాలలో ఈ ఎయిర్ బోట్స్ ను నడిపించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం మేరకు పౌరవిమానయానశాఖ అధికారులు గత ఏడాది రెండుసార్లు నాగార్జున్ సాగర్ పర్యటించి అక్కడి నుంచి ఎయిర్ బోట్స్ నడిపేందుకు అనుకూలంగా ఉందని నివేదిక ఇచ్చారు. హైదరాబాద్‌ నగరంలో హుస్సేన్ సాగర్ కూడా ఎయిర్ బోట్స్ నడిపేందుకు అనుకూలంగా ఉందని నివేదికలో పేర్కొన్నారు. నాగార్జున్ సాగర్ వద్ద గతంలో నిర్మించిన రన్-వే కూడా ఉండటం మరింత కలిసివచ్చింది. జలాలపై ల్యాండింగ్, టేకాఫ్ చేసుకోవచ్చు అవసరమైతే ఆ రన్-వేను కూడా ఉపయోగించుకోవచ్చు. కనుక ముందుగా నాగార్జున్ సాగర్ నుంచి ఎయిర్ బోట్స్ నడిపించేందుకు వీలుగా పౌరవిమానయానశాఖ జనవరి 24న మార్గదర్శకాలను జారీ చేసింది.

నాగార్జున్ సాగర్-హైదరాబాద్‌, సాగర్-విజయవాడల మద్య ఎయిర్ బోట్స్ నడిపించేందుకు టర్బో ఏవియేషన్ సంస్థ ముందుకువచ్చింది. వొక్కో విమానంలో 15-30 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు కనుక టికెట్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంటాయి. కేంద్రప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు లభించి, సాగర్ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తికాగానే పర్యాటకులు సాగర్ జలాలపై నుంచే హాయిగా విమానాలలో ఎగిరిపోవచ్చు.