లంచం అడిగిన ఎమ్మార్వో ...

SMTV Desk 2019-01-26 12:03:48  Jayashankar Bhupalapalli, Mro, Corruption, Patta passbook, Old couple, Rdo office

జయశంకర్ భూపాలపల్లి, జనవరి 26: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వొక విన్నూత్న ఘటన చోటుచేసుకుంది. లంచం ఇస్తేనే పాస్ పుస్తకాలు ఇస్తానని ఓ అధికారి మెలిక పెట్టాడు. దీంతో ఏం చేయాలో తెలియని వృద్ధజంట వినూత్నంగా నిరసనకు దిగారు. ఓ అవినీతిపరుడికి లంచం ఇవ్వాలనీ, దయచేసి తమకి సాయం చేయాలని బిక్షాటన మొదలుపెట్టారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో వెంటనే పాస్ పుస్తకాలను అధికారులు మంజూరు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం ఆజంనగర్ కు చెందిన మంతు లక్ష్మి, బసువయ్య దంపతులు. వీరికి సర్వేనెంబర్‌ 622/52లో 2.37 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1.37 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కానుగంటి కొంరయ్యకు ఫోర్జరీ పత్రాల ద్వారా అప్పగించేందుకు అధికారులు యత్నించినట్లు బసువయ్య దంపతులు ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చినప్పటికీ న్యాయం జరగకపోవడంతో వీరిద్దరూ గతేడాది నవంబర్ 19న పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. న్యాయం చేయకుంటే ఆత్మహత్యే తమకు శరణ్యమని వాపోయారు.

ఈ విషయంలో లంచం ఇస్తేనే తాను భూమి పట్టాలు ఇస్తానని ఎమ్మార్వో చెప్పినట్లు లక్ష్మీ-బసవయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతిలోని ​బంగారం, ​డబ్బు ఖర్చయిపోవడంతో​ వాళ్లకి ఎం చేయాలో పాలుపోక ​ వినూత్నంగా నిరసనకు దిగారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్లెక్సీలపై రాయించి భిక్షాటన చేయడం మొదలుపెట్టారు. తమ భూమిని కాపాడుకోవడానికి సాయం చేయాలని కోరారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కలెక్టర్ దృష్టికి వెళ్లింది.

దీంతో బాధిత కుటుంబానికి వెంటనే పట్టా పాసు పుస్తకాలు జారీచేయాలని కలెక్టర్ ఆర్డీవోను ఆదేశించారు. ​దీనిపై ​స్పందించిన ఆర్డీవో ఇ.వెంకటాచారి వీరిని ఆఫీసుకు పిలిపించి పట్టా పాసుపుస్తకాలను అందజేశారు. కాగా పాస్ పుస్తకాలకు సంబంధించిన కొన్ని సమస్యల కారణంగానే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ఆర్డీవో వెంకటా​ఛా​రి తెలిపారు. ఎమ్మార్వో లంచం డిమాండ్ చేశారనడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు.