మేనిఫెస్టోలో లేని పథకాలను సైతం అమలు చేశాం....

SMTV Desk 2019-01-20 14:14:09  CM KCR At assembly meeting, TRS, Governor, Congress party, TRS elections manifesto

హైదరాబాద్, జనవరి 20: ఆదివారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానానికి సమాధానం చెప్పారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూటికి నూరు శాతం తమది రైతు ప్రభుత్వమని, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పంట రుణాన్ని మాఫీ చేస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండు లక్షలను కూడ పంట రుణ మాఫీ కింద ఇస్తామని చెప్పినా కూడ ప్రజలు నమ్మలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో పంట రుణ మాఫీని ప్రకటించి కూడ అమలు చేయలేదని విమర్శించారు. కానీ, తాము చెప్పినట్టుగానే లక్ష రూపాయాలను పంట రుణాన్ని మాఫీ చేస్తామన్నారు. ఈ దఫా రూ.24 వేల కోట్లను రుణ మాఫీ చేస్తామని వివరించారు. తమది రైతు ప్రభుత్వంగా కేసీఆర్ చెప్పారు. 6062 మంది రైతులకు భీమా పథకాన్ని అమలు చేసినట్టు తెలిపారు. రుణ మాఫీ చేయకపోతే ప్రజలు మమ్మల్ని ఎలా గెలిపించారని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో భూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు.

ప్రతి గంటకూ ఆన్‌లైన్‌లో ధరణి వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేస్తామన్నారు. వరంగల్ లో కంటి వెలుగు పథకం కింద ఆపరేషన్‌లు చేయలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అన్ని అంశాలను వందకు వందశాతం అమలు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. మేనిఫెస్టోలో లేని 76 పథకాలను కూడ అమలు చేసిన ఘనత తమదేనని చెప్పారు. కోటి 32 లక్షల మంది కంటి వెలుగు పథకం కింద పరీక్షలు నిర్వహించామని చెప్పారు. వందకు వంద శాతం పంచాయితీ రాజ్ చట్టాన్ని అమలు చేస్తామన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ మేరకు అవసరమైతే తాను ఈ శాఖను కొన్ని రోజుల పాటు తన వద్దే ఉంచుకొంటానని కేసీఆర్ చెప్పారు. వందశాతం సబ్బిడీతో ఇళ్లను నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటించారు. గత ప్రభుత్వాల హయంలో ఇళ్లు నిర్మించినట్టుగా రికార్డులు చెబుతున్నాయని చెప్పారు. కానీ, వాస్తవానికి ఆయా ప్రాంతాల్లో ఇళ్లు లేవన్నారు.