సీఎల్పీ పదవి ఎవరికి..???

SMTV Desk 2019-01-18 13:08:51  CLP Post, Congress party, Rahul gandhi, Telangana legislative assembly

హైదరాబాద్, జనవరి 18: తెలంగాణలో సీఎల్పీ పదవి కోసం కాంగ్రెస్ నేతలు ఆశావాహులుగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ నేతను ఎన్నుకునే పూర్తి భాద్యతలు కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అప్పగించారు. ఇందుకోసం రాహుల్‌ ఏకగ్రీవ తీర్మానం చేయాలనీ, ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీఎల్పీ సమావేశంలో వారు తీర్మానించారు. అయితే రాహుల్‌ గాంధీ ప్రస్తుతానికి అందుబాటులో లేనందున సీఎల్పీ నేతను శుక్రవారమే ప్రకటించే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో సీఎల్పీ నేతను ఎన్నుకునేందుకు అధిష్టానం దూతగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు పీసీసీ కోర్‌ కమిటీ, పార్టీ సీనియర్‌ నేతలతో సమావేశమైనట్లు చెప్పారు. సీఎల్పీ నేత సీనియర్‌ నేతల అభిప్రాయం మేరకు సీఎల్పీ నేత ఎన్నిక ఉంటుందనీ, అయితే, తుది నిర్ణయం మాత్రం రాహుల్‌ గాంధీదేనని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, టీఎస్‌ సీఎల్పీ నేతను ఎన్నుకునేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశమయ్యారు. ఏఐసిసి దూత వేణుగోపాల్‌ ఎమ్మెల్యేల అభిప్రాయాలను వ్యక్తిగతంగా సేకరించారు. ఈ సందర్భంగా ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో అందరికంటే తానే సీనియర్‌ లీడర్‌ననీ, తనకే సీఎల్పీ నేతగా అవకాశం ఇవ్వాలని కోరారు. సీనియర్‌ నేతలు పార్టీని వీడిపోయిన క్లిష్ట సమయంలోనూ తాను పార్టీనే నమ్ముకుని ఉన్నాననీ, అందుకే తనకు అవకాశం కల్పించాలని కోరారు. పార్టీలో చాలా కాలంగా పాతుకు పోయిన వారికి కాకుండా కొత్త నేతలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలనీ, ఇంట్లో వారి ఓట్లు పడని వారు కూడా నాయకత్వం కోరుకోవడం దురదృష్టకరమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ సీఎల్పీ నేతగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరారు. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలలో గెలుపొందాలంటే పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనీ, లేనట్లయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వెలువడ్డ ఫలితాలే పునరావృతం అవుతాయని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

రాజగోపాల్‌ రెడ్డి సైతం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారనీ, ఆయనకు ఈసారి సీఎల్పీ నేత పదవిని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు, టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క, సీనియర్‌ నేత శ్రీధర్‌ బాబు తాము సైతం సీఎల్పీ నేత రేసులో ఉన్నట్లు పేర్కొన్నారు. అనుభవం దృష్ట్యా తమకే సీఎల్పీ నేత పదవి ఇవ్వాలనీ, అందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని ఏఐసిసి దూతను కోరినట్లు సమాచారం. శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ తనకు ఎల్పీ నేతగా అవకాశం కల్పిస్తే అసెంబ్లీని పార్టీ ఎమ్మెల్యేలను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తాననీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఏకపక్ష విధానాలను అసెంబ్లీ వేదికగా ఎండగడతానని సమావేశంలో పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కకు అవకాశం ఇవ్వడానికే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా చేసిన అనుభవంతో పాటు ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉన్న భట్టికి శాసనసభా వ్యవహారాలపై లోతైన అవగాహన ఉన్న దృష్ట్యా ఈసారి ఆయనకే సీఎల్పీ నేతగా ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, టీ పీసీసీ ప్రసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సైతం సీఎల్పీ నేత రేసులో ఉన్నప్పటికీ ఆయన అభ్యర్థిత్వంవైపు అధిష్టానం అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం.