గ్రామాల్లో మోగనున్న ఎన్నికల ప్రచార హోరు

SMTV Desk 2019-01-14 14:08:37  Grama panchayat elections, Nominations, Telangana

హైదరాబాద్, జనవరి 14: గ్రామ పంచాయతి ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. అనంతరం నామినేషన్ వేసిన అభ్యర్దులకు గుర్తులు కేటాయించడంతో సోమవారం నుండి ప్రచార హోరు ప్రారంభం అయింది. మొదటి విడత పంచాయితీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వరకు గడువు ఉంది. అయితే చాలా గ్రామాలలో నామినేషన్ల ఉపసంహరణలు భారీగా జరిగాయి. ఏకగ్రీవాలు చేసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఎంఎల్‌ఏలు రంగంలోకి బుజ్జగింపులు చేశారు.

చివరకు వొక్కొ గ్రామపంచాయతీలలో మూడు నుంచి ఎనిమిది వరకు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తం మీద ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు వరకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయింది. భరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించారు. సోమవారం నుంచి భరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం చేయనున్నారు. తమకు కేటాయించిన గుర్తుతో ప్రచారం చేసుకోనున్నారు. ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మైకులతో ప్రచారం చేసుకోవచ్చునని, అందుకు అనుమతి తీసుకోవాలని ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రకటించారు.