ఇన్సూరెన్సు కోసం షాప్ తగలపెట్టుకున్నాడు...

SMTV Desk 2019-01-12 13:35:34  For Insurence cash fires own shop, Owner, Khammam

ఖమ్మం, జనవరి 12: తన వ్యాపారంలో లాభాలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయి ఎం చేయాలో తెలీక ఇన్సూరెన్సు కోసం సొంత షాప్ నే తగలపెట్టుకున్నాడు ఓ వ్యక్తి. చివరికి ఇన్సూరెన్సు రాకపోగా తనే షాప్ ను తగలపెట్టాడు అని కేసు విచారణలో బయటపడింది. పూర్తి వివరాల ప్రకారం ఖమ్మం పట్టణానికి చెందిన దేవాండ శ్రీనివాస్ 2017 మార్చి నెలలో ఓ బిల్డింగ్ ని అద్దెకు తీసుకొని బట్టల దుకాణం పెట్టాడు. అయితే అతను ఊహించినంతగా వ్యాపారం సాగకపోగా ఏడాది తిరగకముందే నష్టాలబాట పట్టాడు. ఆ నష్టం పూడ్చుకునేందుకు ఓ ప్లాన్ వేశాడు. 2018 అక్టోబర్ 26న తన దుకాణంలోని బట్టలు, ఫర్నీచర్, విలువైన కొన్ని వస్తువులకు రూ.99లక్షల ఇన్సూరెన్స్ చేయించాడు.

ఆ తర్వాతి రోజు దుకాణంలోని బట్టలు, ఇతర వస్తువులను వేరే ప్రాంతానికి తరలించాడు. 29వ తేదీన కింద ఫ్లోర్ లో ఉన్న బట్టలపై పెట్రోల్ పోసి కరెంట్ వైర్ల ద్వారా నిప్పు పుట్టించి వాటికి అంటించాడు. దీంతో మంటలు వొక్కసారిగా వ్యాపించాయి. ఈ మంటల కారణంగా దుకాణంలోని విద్యుత్ పరికరాలు కాలిపోయి అక్కడే ఉన్న సిలిండర్ పేలింది. దీంతో దుకాణం సగానికి పైగా కాలిబూడిదయ్యింది. శ్రీనివాస్ కి కూడా స్వల్పగాయాలు అయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టగా దుకాణ యజమానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.