వచ్చే ఏడాది నుండి కొత్త పెన్షన్లు

SMTV Desk 2018-12-27 19:56:57  Telangana state governament, TRS, KCR, Pensions, New year, April

హైదరాబాద్, డిసెంబర్ 27: తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నుండి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్త ఓటర్లు లిస్టు ప్రకారం ఈ పెన్షన్లు అందనున్నాయి. ఆసరా పింఛన్‌లకు సంబంధించి హామి ఇచ్చిన మేరకు 57 సంవత్సరాలు వయస్సు నిండిన అర్హులైన ప్రతి వొక్కరు వచ్చే ఏప్రిల్‌ వొకటవ తేది నుంచి కొత్తగా పెన్షన్‌ అందించడానికి అర్హులను గుర్తించేందుకు తగిన కార్యచరణ ప్రణాళిక రూపొదించి అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌.కె.జోషి అధికారులకు సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్‌లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తగు సూచనలు జారీ చేయనున్నట్లు తెలిపారు. 57 సంవత్సరాలకు పైబడి ఉన్న వయో వృద్దులకు ఆసరా పెన్షన్ల మంజూరుకు సంబంధించి విధివిధానాలనను ఇదివరకే జిల్లా కలెక్టర్‌లకు పంపడం జరిగిందని సిఎస్‌ అన్నారు. 57-67 వరకు వయస్సు గల వారికి జల్లాలలో 20లక్షల మందిని ఇప్పటికే గుర్తించడం జరిగిందన్నారు. పెన్షన్‌గా ఇచ్చే మొత్తం పెంపుకు సంబంధించి ఆసరా పెన్షనలను రూ.1000 నుంచి రూ.2016లకు, వికలాంగులకు పెన్షన్‌ రూ.1500 నుంచి రూ.3016లకు పెంచే విషయంపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆసరా పెన్షన్‌లకు సంబంధించి పంచాయితీరాజ్‌ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌, కమిషనర్‌ నీతు ప్రసాద్‌లతో సమీక్షించామని జిల్లా కలెక్టర్‌లతో గత వీడియో కాన్ఫరెన్సు నిర్వహించామన్నారు.

ఆసరా పెన్షన్‌ మంజూరు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా అర్హుల కొత్త పెన్షన్‌ల గుర్తింపు కోసం 19.11.2018న ప్రచురించిన ఓటరు లిస్టులను వినియోగించుకోవాలని, ఓటరు జాబితాలో 57 నుంచి 64 వరకు వయస్సు ఉన్న వారి వివరాలు తీసుకుని ఎస్‌.కె.ఎఫ్‌ డాటాలో సరిచేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు ఈ లిస్టులను గ్రామీణ ప్రాంతాలలో పంచయితీ సెక్రటరీలకు, పట్టణ ప్రాంతాలలో బిల్‌ కలెక్టర్‌లకు వెరిఫికేషన్‌ అందిస్తారని తెలిపారు. అర్హులైన వారి లిస్టులో సంబంధిత లబ్దిదారుని యుఐడి నెంబర్‌, బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌, ఫోటోతో సహా సేకరించి గ్రామస్థాయిలో ఎంపిడిఓలు, పట్టణ ప్రాంతాలలో మున్సిపల్‌ కమిషనర్లు పరిపాలన అనుమతి నిమిత్తం జిల్లా కలెక్టర్‌లకు అందజేస్తారన్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్న తరువాత, అర్హులైన జాబితాను సంబంధిత వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు సిఎస వెల్లడించారు. పెన్షన్‌ మంజూరికి గ్రామాలలో వార్షిక ఆదాయం లక్షాయాభైవేలు, పట్టణాలలో రెండు లక్షల ఆదాయ పరిమితి ఉండాలన్నారు. మూడు ఎకరాల తరి, 7.5 ఎకరాల మెట్ట భూములు ఉన్నవారు అర్హులన్నారు. ప్రతి కుటుంబంలో వొకరికే మాత్రమే అర్హత ఉంటుందన్నారు. అర్హత ఉన్న ప్రతిపేదవారికి పెన్షన్‌ అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సిఎస్‌ ఆదేశించారు.