టీఆరెస్ పై కేంద్రానికి ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు

SMTV Desk 2018-12-27 19:07:36  TRS, BJP, Telangana assembly elections, Central election commission Party leaders, Laxman, Muralidhar rao

హైదరాబాద్, డిసెంబర్ 27: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆరెస్ పార్టీ ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడిందని రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో కావాలనే ఓట్లను గల్లంతు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ ఎంఐఎం ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో మాత్రం ఓటర్ల సంఖ్య పెరిగిందన్నారు. దీనిపై తమకున్న అనుమానాలను బిజెపి నాయకులు సీఈసి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్షలమంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తొలగించిందని పేర్కొన్నారు. అధికార పార్టీకి సహకరించడానికే ఎన్నికల అధికారులు ఇలా ఓట్లు తొలగించారని అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు సీఈసిని కోరారు.

పోలింగ్ ముగిసిన తర్వాత స్వయంగా ఎన్నికల ప్రధానాధికారి మాట్లాడుతూ నిజంగానే చాలా ఓట్లు గల్లంతయ్యాయని ప్రకటిస్తూ క్షమాపణ చెప్పారని వారు గుర్తుచేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయనడానికి ఈ ప్రకటనే నిదర్శనమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ తదితరులు వున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తాము పిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఈసి హామీ ఇచ్చిందన్నారు.