చలి పులి... తెలుగు రాష్ట్రాల్లో 34 మంది మృతి..!

SMTV Desk 2018-12-19 11:45:28  AP, Telangana, Low Temperatures

హైదరాబాద్, డిసెంబర్ 19: బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా అన్ని చోట్లా కనిష్ట ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి, సూర్యుడు కనుమరుగైపోయాడు. నాలుగు రోజుల నుంచి వీస్తున్న ఈదురు గాలులకు తోడు..శీతలగాలులు వీస్తున్నాయి. దీంతోఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉత్తర భారతదేశ తరహా వాతావరణం నెలకొంది.

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో చలి తీవ్రతకు ఇప్పటివరకు 34 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ లో 23 మంది, తెలంగాణలో 11 మంది మరణించారు. విశాఖ జిల్లాల్లో అత్యధికంగా ఆరుగురు, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో వొకరు చనిపోయారు. కాగా, ప్రకాశం జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు, విజయనగరంలో ఇద్దరు చనిపోయారు. ఇక తెలంగాణాలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి, రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సంవత్సరం పగటి సమయంలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. కాగా, బుధవారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు పెరిగి.. రాత్రి చలి అధికమవుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.