హైదరాబాద్, డిసెంబర్ 18: స్నేహం చేసినందుకు ఓ ప్రబుద్ధుడు యువతికి చుక్కలు చూపించాడు. సోషల్ మీడియాలో యువతి ఫొటోలను సేకరించి నగ్న ఫొటోలుగా మార్ఫింగ్ చేశాడు. అనంతరం ఆమె పేరు మీద ఫేక్ ఫేస్ బుక్ ఖాతాలను ఓపెన్ చేసి వాటిని అందులో పోస్ట్ చేసాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అధికారులు అరెస్ట్ చేసారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలోని కాలాపత్తర్ ప్రాంతంలో ఉంటున్న మహ్మద్ మొయిజుద్దీన్(22)కు ఇటీవల ఓ యువతి పరిచయమయింది. ఈ నేపథ్యంలో యువతి సోషల్ మీడియా అకౌంట్ గురించి తెలుసుకున్న నిందితుడు ఆమె ఫొటోలను డౌన్ లోడ్ చేసుకున్నాడు. అనంతరం వాటిని నగ్న ఫొటోలుగా మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ ఖాతాలోనే పోస్ట్ చేశాడు. అది గమనించిన బాధితురాలు అతడిని నిలదీయగా ‘ఇదొక్కటే కాదు.. నీ పేరు మీద ఇంకా 7 అకౌంట్లు ఉన్నాయి. చూసుకో పో అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా.. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన అధికారులు, సదరు అకౌంట్లను బ్లాక్ చేశారు. అనంతరం నిందితుడు మొయిజుద్దీన్ ను అధికారులు పక్కా ప్లాన్ తో పట్టుకున్నారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించడంతో కోర్టు ముందు హాజరుపరచి చరసాలలోకి నెట్టారు.