ఫలితాలు రాగానే తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోతారు: కేటిఆర్‌

SMTV Desk 2018-12-05 13:20:16  KTR,TRS,lagadapati,

హైదరాబాద్, డిసెంబర్ 04: మాజీ కాంగ్రెస్‌ నేత లగడపాటి రాజగోపాల్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి ఈ ఎన్నికలలో గెలవబోతున్న మరో ముగ్గురు అభ్యర్ధుల పేర్లు ప్రకటించారు. అలాగే ఈసారి ఎన్నికలలో 68.5 శాతం పోలింగ్ నమోదు అయితే ప్రజాకూటమి గెలిచే అవకాశం ఉందని, అంతకంటే ఎక్కువ జరిగితే రాష్ట్రంలో ‘హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. దీనిపై సిఎం కేసీఆర్‌ తీవ్రంగా స్పందిస్తూ లడగపాటిది చిలక జోస్యం అని కొట్టి పారేయగా, మంత్రి కేటిఆర్‌ భిన్నంగా స్పందించారు.

“కొన్ని రోజుల క్రితమే లగడపాటి నాకు వొక మెసేజ్ పంపారు. దానిలో తెరాసకు 65-70, ప్రజాకూటమికి 35-40, బిజెపికి 2-3, మజ్లీస్ పార్టీకి 6-7, ఇతరులకు 1-2 స్థానాలు లభిస్తాయని తెలియజేశారు. అయితే మేము అంతకంటే ఎక్కువ స్థానాలే గెలుచుకోబోతున్నామని సమాధానం చెప్పగా, మళ్ళీ ఆయన స్పందిస్తూ ‘ఎన్నికల ప్రచారానికి ఇంకా 17 రోజులు సమయం ఉంది. ఎన్నికల ప్రచార వ్యూహాలను అమలుచేయడంలో తెరాసకు మంచి నేర్పు ఉందని గ్రేటర్ ఎన్నికలలోనే నిరూపితమైంది. కనుక ఈ 17 రోజులలో ఏమి జరిగినా నేను ఆశ్చర్యపోను, అని లగడపాటి జవాబు ఇచ్చారు,” అని చెపుతూ తమ మద్య సాగిన ఆ సందేశాలను మంత్రి కేటిఆర్‌ నిన్న మీడియాకు విడుదల చేశారు.

కేటిఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, “17 రోజుల ముందు తెరాసకు 65-70 సీట్లు గెలుచుకొని అధికారంలోకి రాబోతోందని చెప్పిన లగడపాటి ఇప్పుడు పోలింగుకు ముందు హటాత్తుగా ఎందుకు మాట మార్చారు అంటే చంద్రబాబు నాయుడు వొత్తిడి వల్లనే అని చెప్పక తప్పదు. లగడపాటి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ప్రస్తుతం తెలంగాణకు టూరిస్టులుగా వచ్చారు. డిసెంబరు 11న ఫలితాలు రాగానే తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోతారు,” అని ఎద్దేవా చేశారు.