రాహుల్- బాబు ఎన్నికల ప్రచారం

SMTV Desk 2018-11-27 13:28:20  rahul gandhi, chandra Babu, elections,

హైదరాబాద్, నవంబర్ 27: రేపటి నుంచి రాష్ట్రంలో రాహుల్ బాబు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. రాహుల్ బాబు అంటే రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు అని అర్ధం. రాహుల్ గాంధీ రేపు ఉదయం 9 గంటలకు డిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకొంటారు. అక్కడి నుంచి నేరుగా కొడంగల్‌, ఆ తరువాత వికారాబాద్ బహిరంగసభలలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 2.30 గంటలకు ఖమ్మంలో ప్రజాకూటమి నిర్వహించే బహిరంగసభలో రాహుల్-బాబు పాల్గొంటారు. వారితోపాటు కూటమి ముఖ్య నేతలు కోదండరామ్‌, చాడా వెంకటరెడ్డి, ఎల్ రమణ, సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొంటారు. అనంతరం రేపు (బుదవారం) సాయంత్రం రాహుల్-బాబు కలిసి సికింద్రాబాద్‌, నాంపల్లిలో రోడ్ షోలు నిర్వహిస్తారు.

మరునాడు అంటే 29న సమయం సరిపోతే ఇద్దరూ కలిసి శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో రోడ్ షోలు నిర్వహించే అవకాశం ఉంది. లేకుంటే చంద్రబాబు నాయుడు వొక్కరే రోడ్ షోలు నిర్వహిస్తారు. 29న ఉదయం హైదరాబాద్‌లోని కొన్ని విద్యాసంస్థలలో రాహుల్ గాంధీ విద్యార్ధులతో ముఖాముఖీ సమావేశాలలో పాల్గొంటారు. ఆ తరువాత భూపాలపల్లి, ఆర్మూరులో బహిరంగసభలలో పాల్గొంటారు. తరువాత చేవెళ్ళకు వెళ్ళి అక్కడ బస్తీ ప్రజల సమావేశానికి హాజరవుతారు. అనంతరం డిల్లీ తిరిగి వెళతారు.

ప్రముఖ తెలుగు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 30వ తేదీన కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తున్న తన సోదరుడి కుమార్తె సుహాసిని తరపున ఎన్నికల ప్రచారం చేస్తారు. ఆ తరువాత టిడిపి అభ్యర్ధులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో రోడ్ షోలు చేస్తారు. రేపు ఖమ్మంలో జరుగబోయే ప్రజాకూటమి బహిరంగసభలో బాలకృష్ణ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.