నోటా అవకాశాన్ని వినియోగించుకోండి : కేటిఆర్‌

SMTV Desk 2018-11-22 19:11:09  ktr, trs, mallareddy enganeering college, nota

హైదరాబాద్, నవంబర్ 22: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస మంత్రి కేటిఆర్‌ ఈ రోజు నగరంలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేను మా పార్టీకే ఓటు వేయాలని అడగడం సహజమే. వొకవేళ మీరు మా పార్టీకి ఓటు వేయాలనుకోకపోయినా మీకు నచ్చిన సమర్ధుడైన అభ్యర్ధికి ఓటు వేయండి. వొకవేళ మీకు అభ్యర్ధులలో ఎవరూ నచ్చకపోతే కనీసం నోటా అవకాశాన్ని వినియోగించుకోండి. అంతే తప్ప ఓటు వేయకుండా ఇంట్లో కూర్చోవద్దు,” అని అన్నారు.

ఈసందర్భంగా గత నాలుగేళ్లలో రాష్ట్రానికి దేశవిదేశాల నుంచి కొత్త పరిశ్రమలను రప్పించడం కోసం, తద్వారా ఉద్యోగాల కల్పన కోసం తమ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకొందో మంత్రి కేటిఆర్‌ విద్యార్ధులకు వివరించారు. తెలంగాణ ఏర్పడక మునుపు పరిస్థితులు, ఏర్పడిన తరువాత గత నాలుగేళ్లలో తెలంగాణలో వచ్చిన మార్పుల గురించి మంత్రి కేటిఆర్‌ విద్యార్ధులకు చక్కగా వివరించారు.

ఈ నాలుగేళ్ళలో తమ ప్రభుత్వం చాలా చిత్తశుద్దితో, ముందుచూపుతో చేపట్టిన అనేకానేక అభివృద్ధి కార్యక్రమాల కారణంగానే నేడు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దేశంలో నెంబరు: 1 స్థానంలో ఉందని మంత్రి కేటిఆర్‌ వివరించి, ఈ అభివృద్ధిని నిరంతరం కొనసాగించేందుకు విద్యార్ధులు అందరూ తెరాసకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.