ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై విమర్శలు చేసిన కవిత

SMTV Desk 2018-11-15 12:22:41  MP Kavitha, MLC Bhupathireddy, Congress, TRS

నిజామాబాద్, నవంబర్ 15: తెలంగాణ రాష్ట్ర మంత్రి కవిత ఎన్నికల సందర్భంగా నిజామబాద్ ప్రచారంలో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పై మండిపడ్డారు. “కాంగ్రెస్ పార్టీలో చేరిన భూపతిరెడ్డి తెరాస ద్వారా పొందిన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీస్తున్న చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పార్టీ ఎందుకు పొత్తులు పెట్టుకోందో చెప్పాలి. దాని నేతృత్వంలో ఏర్పాటు చేసుకొన్న ప్రజాకూటమివైపు ప్రజలు లేరు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి రేయింబవళ్లు కృషి చేస్తున్న తెరాస వైపే ప్రజలున్నారు,” అని అన్నారు.

తెరాస ద్వారా భూపతిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి లభించింది కనుక ఆయన ఆ పదవికి రాజీనామా చేయాలని కవిత కోరడం న్యాయమే. కానీ కాంగ్రెస్‌, టిడిపి, వైకాపాల నుంచి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు సెప్టెంబరు 6న శాసనసభ రద్దు అయ్యే వరకు తమ పదవులలోనే కొనసాగినప్పుడు భూపతిరెడ్డిని రాజీనామా చేయమని కోరడం సరికాదు. తెరాస నైతిక విలువలు పాటించి ఉండి ఉంటే, ప్రతిపక్ష పార్టీలు దాని బాటలోనే నడిచి ఉండేవి. నడవకపోతే ప్రజలే వాటిని నిలదీసి ఉండేవారు.

ఇక కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ టిడిపితో పొత్తు పెట్టుకొంది కానీ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో కాదనే సంగతి అందరికీ తెలుసు. వొక్క టిడిపితోనే కాక టిజేఎస్, సిపిఐ పార్టీలతో కూడా అది పొత్తులు పెట్టుకొని మహాకూటమిని ఏర్పాటు చేసుకొంది. మహాకూటమి ఏర్పాటుకు అనేక కారణాలున్నాయి. వాటిలో అతి ముఖ్యమైన కారణం ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే.

వొక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఆ అధికారం ఉంది. దానిని తెరాస ప్రశ్నించలేదు. కనుక చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి ప్రశ్నిస్తోందని భావించవచ్చు. అయితే టిడిపితో పొత్తులు పెట్టుకొంటే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావచ్చుననే కాంగ్రెస్‌ వ్యూహం ఫలిస్తుందా? లేక టిడిపితో పొత్తు కారణంగానే కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలవుతుందా? అనే విషయం డిసెంబరు 11 వ తేదీన తెలుస్తుంది.