14 వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్

SMTV Desk 2017-07-20 17:05:51  president winner ramnathkovindh,

న్యూఢిల్లీ, జూలై 20 : రాష్ట్రపతి ఎన్నికల లెక్కింపు ఫలితాల్లో విజయం సాధించి భారత దేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్నికయ్యారు. తొలి నుంచి భారీ ఆధిక్యంతో దూసుకెళ్లిన ఎన్డీఏ అభ్యర్థి కోవింద్ యూపీఏ అభ్యర్థిగా మీరా కుమార్‌ పై ఘన విజయం సాధించారు. మీరా కుమార్‌పై ఆయన 65.6శాతం ఓట్లతో విజయం సాధించారు. ఇక రామ్‌ నాథ్‌కు 7,02, 644 ఓట్లు రాగా, మీరా కుమార్‌కు 3,67, 314 ఓట్లు వచ్చాయి. భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ ఎన్నికైనట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ అనూప్‌ మిశ్రా మీడియాకు అధికారికంగా వెల్లడించారు. ఈనెల 25న దేశ 14వ రాష్ట్రపతిగా కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన కోవింద్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా శుభాకాంక్షలు తెలిపారు. మరో వైపు కోవింద్‌ గెలుపుతో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. రామ్‌నాథ్‌ 1945 అక్టోబర్‌ 1న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ దెహత్‌ జిల్లాలోని డేరాపూర్‌ తహశీల్‌లోని పరాంఖ్‌ గ్రామంలో జన్మించారు. భాజపాలో కీలక నేతగా ఎదిగి యూపీ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. 1994 నుంచి 2006 వరకూ రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. 1998 నుంచి 2002 వరకూ భాజపా దళిత మోర్చా అధ్యక్షుడిగా రామ్‌నాథ్‌ పనిచేశారు. అఖిలభారత్‌ కోలి సమాజ్‌ అధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2015 ఆగస్టు 16 నుంచి ఆయన బిహార్‌ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ఈ ఏడాది జూలై 24న ముగుస్తుంది. కొత్త‌ రాష్ట్రపతి కోసం బీజేపీ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి దళిత నేత , బీహారు గవర్నర్ రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్డీఏ ప్రతిపాదించింది.. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన కోవింద్ వృత్తి రీత్యా లాయర్. బిజెపి దళిత మోర్చా అధ్యక్షుడిగా కూడా ఆయన గతంలో పనిచేశారు. కె.ఆర్ నారాయణన్ తర్వాత రాష్ట్రపతి భవన్ లోకి రెండో దళిత నేతగా అడుగు పెట్టనున్నారు.