పార్టీలు మారడం దానంకు కొత్తేమీ కాదు..

SMTV Desk 2018-06-23 18:53:30  danam nagendra, komatireddy venkat reddy, danam nagendra resign congress, trs

హైదరాబాద్, జూన్ 23 ‌: పార్టీలు మారటం కూడా దానం నాగేందర్‌కు కొత్తేమీ కాదని.. గతంలో టీడీపీకు వెళ్లి తిరిగి వచ్చి కాంగ్రెస్‌లో మంత్రి పదవి అనుభవించారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. దానం నాగేందర్ రెండేళ్లుగా టీఆర్ఎస్ కు టచ్‌లో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన పార్టీ వీడటం ముందుగా ఊహించేందనని.. ఈ మేరకు వెంకటరెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెరాసలోకి వెళ్లేందుకు గతంలో ఫ్లెక్సీలు కూడా సిధ్దం చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడేమో బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందని.. సొంత ఎజెండా కోసమే పార్టీ మారారు తప్ప దానంకు మరో సమస్య లేదని స్పష్టం చేశారు. దానం పార్టీ మరడాన్ని పార్టీ నేతలు ఎవరూ తీవ్రంగా తీసుకోవాల్సిన పని లేదని సూచించారు. "అసలు టీఆర్‌ఎస్‌ పార్టీలోనే సామాజిక న్యాయం లేదు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ మోసం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ క్యాబినెట్‌లో బీసీలకు తగిన ప్రాధాన్యత లేదు. మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించకుండా కేసీఆర్ మహిళలను అవమాన పర్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు ప్రాధాన్యత కల్పించాం.. దళిత, గిరిజన, బీసీలకు ప్రాధాన్యతనిచ్చాం. కాంగ్రెస్ నేతలంతా ధైర్యంగా ఉండాలి. రాబోయే కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది" అని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.