కోటి రూపాయలను కాదన్నారు..

SMTV Desk 2018-05-23 17:23:31  AMITAAB BACCHAN, SHARUKH KHAN, RED CHIILIS ENTERTAINMENT.

హైదరాబాద్, మే 23 : అగ్ర హీరో హీరోయిన్స్.. మార్కెట్ లో తనకున్న డిమాండ్ ను బట్టి తమ సినిమాలకు భారీ మొత్తంలోనే పారితోషికం తీసుకుంటారు. అలాగే మరికొందరైతే తోటి నటీనటులతో తమకున్న స్నేహంతో ఉచితంగా నటించడానికి కూడా వెనుకాడరు. అలాంటి కథానాయకులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు బిగ్ బి అమితాబ్. షారూక్ ఖాన్.. తన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్తైన్మెంట్ లో సుమారు పదమూడేళ్ల క్రితం తెరకెక్కించిన "పహేళి" చిత్రంలో అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా కోసం షారుఖ్ అమితాబ్ కు కోటి రూపాయల చెక్కును పంపించారట. కాని అమితాబ్ ఆ చెక్కును సున్నితంగా తిరస్కరించారట. ఈ విషయాన్ని షారూక్ ఖాన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలుపుతూ.. "సినిమా షూటింగ్‌ పూర్తవగానే అమితాబ్‌కు కోటి రూపాయల చెక్కు పంపాను. తమ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు చెబుతూ లేఖ కూడా రాశాను. కానీ ఆయన ఆ చెక్కు తీసుకోలేదు. ఎందుకు అని అడిగితే.. నీతో కలిసి పనిచేసిన ఏ సినిమాకూ నేను డబ్బు తీసుకోను అన్నారు. పారితోషికం తీసుకోకపోయినా రోజూ ఉదయాన్నే 6 గంటలకు సెట్స్‌కు వచ్చేసేవారు. అలాంటి జెంటిల్‌మెన్‌ను నేను ఎప్పుడూ చూడలేదు" అని వెల్లడించారు.