ధియేటర్ లో టాలీవుడ్ నటికి చేదు అనుభవం ..

SMTV Desk 2018-05-18 18:15:00  tolly wood actor hari teja, hariteja actress, tollywood, mahanati

హైదరాబాద్‌, మే 18 : టాలీవుడ్‌ నటి, బిగ్‌బాస్‌ ఫైనలిస్ట్‌ హరితేజకు ధియేటర్ లో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ‘మహానటి’ సినిమాను చూడటానికి థియేటర్‌కు వెళ్లినప్పుడు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఈ మేరకు లైవ్‌లో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కేవలం డబ్బు కోసమే ఆర్టిస్టులు పని చేస్తానుకోవద్దని, చేసే పనిని 100 శాతం మనసుపెట్టి చేస్తామన్నారు హరితేజ. 100 రూపాయలు పెట్టి టికెట్‌ కొని సినిమా చూస్తే అందులో ఉన్న నటీనటులపై తమ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే హక్కు ఉండదన్నారు. ఎప్పటినుంచో ‘మహానటి’ సినిమా చూద్దామనుకున్నా వీలు పడక చివరికి ఈ రోజు అమ్మా, నాన్న, చెల్లి అందరితో కలిసి సినిమాకెళ్లానని, అయితే సినిమా హాల్లో పక్కనున్న ఇద్దరు ప్రేక్షకులు తనతో ప్రవర్తించిన తీరు జీర్ణించుకోలేక పోయానని కన్నీటి పర్యంతమవుతూ ఇలా చెప్పింది. "విశ్రాంతి వరకు చెల్లి పక్కన కూర్చున్న నేను.. అమ్మ ఆశపడటంతో విశ్రాంతి తర్వాత అమ్మ పక్కన కూర్చునేందుకు వెళ్తున్న తరుణంలో.. నాన్నను ఇటు వైపుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అటువైపున్న ఓ తల్లీ కూతుళ్లు నాతో వాదనకు దిగారు. ‘ఇంతకుముందు కూర్చున్నట్లే కూర్చోండమ్మా.. మీ నాన్న పక్కన కూర్చోవడానికి నా కూతురుకు కంఫర్ట్‌గా లేదు అంది’. దానికి నేను ఏమీ అనకపోగా.. అందరూ అలా ఉండరు కదా.. తప్పేంటి ఆంటీ.. తండ్రే కదా అన్నాను. దానికి ఆమె ఒక మాట అంది. ‘మీరైతే సినిమా వాళ్ళమ్మా.. ఎవరి పక్కనైనా కూర్చుంటారు.. మాకా దరిద్రం పట్టలేదు అని" . ఇక నాకు కట్టలు తెంచుకునే కోపం వచ్చింది. నా వల్ల కాలేదు. బాగా డిస్కషన్ జరిగింది. ఆ మాటను నేను భరించలేక పోయా..’’ అని చెబుతూ హరితేజ భావోద్వేగానికి లోనయ్యారు.