సెల్ఫీలకు వ్యతిరేకం.. అలా అయితే ఇక్కడికి రావొద్దు..

SMTV Desk 2018-05-09 15:22:27  CANNES 2018, SELFEES RESTRICTED, FRANCE.

హైదరాబాద్, మే 9 : అంతర్జాతీయ కేన్స్‌ 71వ చలన చిత్రోత్సవ వేడుక ఘనంగా అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌ రివీరా నదీ తీరాన ఎ వేడుక అంగరంగ వైభవంగా సాగుతోంది. ఫొటోగ్రాఫర్లు, అభిమానులు, సెలబ్రిటీలతో కళకళలాడే ఈ కేన్స్‌ వేడుకలో ఈ ఏడాది నుంచి కొత్త నిబంధనలు విధించారు. తమ అభిమాన నటీనటులతో సెల్ఫీలు దిగాలని చాలా మంది తహతహలాడుతుంటారు. కాని ఈ ఏడాది విధించిన నిబంధనల ప్రకారం.. కేన్స్ లో సెల్ఫీలు నిషేధం. వేడుకలో సెల్ఫీలను నిషేధిస్తున్నట్లు ఇటీవల కేన్స్‌ ఫెస్టివల్‌ డైరెక్టర్‌ థీర్రీ ఫ్రెమో వెల్లడించిన విషయం తెలిసిందే. "కేన్స్.. అంతర్జాతీయంగా అతిగొప్ప చలనచిత్రోత్సవం. ఎర్ర తివాచీపై ఎవ్వరూ ఒక్క సెల్ఫీ కూడా తీసుకోకూడదని నిర్ణయించాం. దాని పవిత్రతను కాపాడుకుందాం. ఈ నిబంధనకు సిద్ధపడితేనే కేన్స్‌కు రండి. రెడ్‌ కార్పెట్‌మీద వగలు పోతూ, సెల్ఫీలు తీసుకుంటూ హంస నడకలు ఇక కుదరవు. మీ వెనక వచ్చే సెలబ్రిటీలకు గౌరవం ఇవ్వండి.. లేకపోతే, మీరు రావద్దు!" అని ప్రకటించారు. అంతేకాదు కేన్స్‌ ఫెస్టివల్‌లో మీడియా ప్రతినిధులకు ప్రత్యేక షోలు ఉండవనీ, ఇలా చేయడంతో కొందరు సమీక్షలు రాసి సినిమాల మీద ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని నాశనం చేస్తున్నారని నెట్‌ఫ్లిక్స్‌ సినిమాలను కూడా కేన్స్‌లో నిషేధించారు.