మేడమ్‌ టుస్సాడ్స్‌లో.. మహేష్ మైనపు విగ్రహం

SMTV Desk 2018-04-27 11:11:09  mahesh babu, madame tussauds prince, tollywood, super star

హైదరాబాద్‌, ఏప్రిల్ 27 : తెలుగు చిత్ర పరిశ్రమ అందగాడు, ప్రిన్స్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు కు అరుదైన గౌరవం లభించింది. ఆయన మైనపు విగ్రహాన్ని లండన్‌లోని ప్రముఖ మేడమ్‌ టుస్సాడ్స్‌‌ మ్యూజియంలో కొలువుతీరబోతుంది. ఈ విషయాన్ని మహేశ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. "ప్రఖ్యాతి గాంచిన మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆర్టిస్ట్‌లందరూ దగ్గరుండి నా వివరాలు సేకరించినందుకు ధన్యవాదాలు. అద్భుతః" అని ట్వీట్‌ చేశారు. ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో మహేశ్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. ఈ సందర్భంగా మేడమ్‌ టుస్సాడ్స్‌ మహేశ్‌కు మైనపు విగ్రహం రూపొందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహేశ్‌ సతీమణి నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్‌ చేశారు. ఫొటోలో మ్యూజియం ఆర్టిస్ట్‌లు మహేశ్‌ కొలతలు తీసుకుంటూ కన్పించారు. ‘త్వరలో ప్రఖ్యాత మేడమ్‌ టుస్సాడ్స్‌లో మహేశ్ మైనపు బొమ్మ రాబోతోంది. గర్వంగా ఉంది..గర్వంగా ఉంది..గర్వంగా ఉంది’ అని హర్షం వ్యక్తం చేశారు.