తలైవా చిత్రంలో విజయ్‌ సేతుపతి

SMTV Desk 2018-04-26 16:53:01  rajni kanth new movie, Vijay Sethupathi, sun pictures, coliwood

చెన్నై, ఏప్రిల్ 26 : ఎట్టకేలకు క్రేజీ కాంబినేషన్ పై వస్తున్న ఊహాగానాలుకు తెరపడింది. సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా యువ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సన్‌పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశాన్ని సంస్థ స్వయంగా ప్రకటించింది. గత కొంతకాలంగా విజయ్‌ సేతుపతి ఈ ప్రాజెక్టులో నటించబోతున్నాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో ఆయన ప్రతినాయక పాత్రలో కన్పిస్తారని సమాచారం. వరుస హిట్లతో జోరు మీదున్న విజయ్‌కు ఇది మంచి అవకాశమే. తలైవాతో విజయ్ నటించడం ఇదే తొలిసారి. దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజుకి విజయ్‌ సేతుపతితో మంచి అనుబంధం ఉంది. అతడి తొలి చిత్రం ‘పిజ్జా’లో విజయ్‌ కథానాయకుడు కాగా మరో చిత్రం ‘జిగర్తాండ’లో అతిథి పాత్రలో కన్పించారు. తాజా వార్తతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.