ఆగని కార్పోరేట్ ఆగడాలు..వేసవిలో క్లాసులు..

SMTV Desk 2018-04-26 12:45:57  Summer classes, in corporate colleges

హైదరాబాద్, ఏప్రిల్ 26: మండుటెండలకు ఇంటివద్ద సేద తీర్చుకొంటూ, అట పాటలతో గడపాల్సిన విద్యార్థులు భానుడి ప్రతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతూ తరగతి గదుల్లో పాఠాలు వినాల్సిన దుస్థితి నెలకొంది. నిబంధనలను తుంగలో తొక్కి మార్కులు, ర్యాంకులే లక్ష్యంగా కార్పొరేట్‌ కళాశాలలు వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఇంటర్‌ విద్యార్థులకు ప్రభుత్వం మార్చి 29 నుంచి మే 30 వరకు వేసవి సెలవులను ప్రకటించింది. ఇంటర్‌ విద్యార్థులకు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహించకూడద ని, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రం ఐఐటీ, నీట్‌ కోచింగ్‌ ఇచ్చుకునే వెసులుబాటును కల్పించింది. జిల్లాలో 296 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఉండగా లక్షా 60 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. చాలా కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించకూడదని ప్రైవేట్‌ కళాశాలల యా జమాన్యాలతో బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియెట్‌ అధికారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఏ కళాశాల యాజమాన్యం కూడా విద్యార్థులకు తరగతులు నిర్వహించకూడదని, అలా చేస్తే కళాశాలల గుర్తింపు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ కళాశాలల యాజమాన్యాల్లో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఆగ్రహించిన డిఐఇఓ జయప్రదబాయి హైదరాబాద్‌ జిల్లాలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం సిలబ్‌సను బోధిస్తున్నారనే ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా డీఐఈవో తరగతుల నుంచి విద్యార్థులను పంపించి ఆయా కళాశాలలకు తాళాలు వేశారు. జిల్లాలోని 40 ప్రైవేట్‌ కళాశాలలకు తాళాలు వేసి, తాళం చెవులను డీఐఈఓ కార్యాలయానికి తీసుకొచ్చారు. అయినప్పటికీ పలు కళాశాలలు వేసవి తరగతులను యధేచ్చగా నిర్వహిస్తున్నాయి. దీంతో బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియెట్‌ అధికారులు రోజు కళాశాలలను తనిఖీలు చేస్తున్నారు. విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న పలు కళాశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు.