కనీస నిల్వలను తగ్గించిన ...ఎస్‌బీఐ!

SMTV Desk 2017-09-26 07:14:50  sbi, saving account, minimum balance,

న్యూ ఢిల్లీ : మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా అయితే మీ ఖాతాలో 3 వేలు ఉంటే చాలు అంటున్నారు బ్యాంకు అధికారులు. బ్యాంకులోని సేవింగ్స్ ఖాతాలో కనీసం రూ.5000 ఉండాల్సిందేనంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నెలల ముందు నిబంధనను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సేవింగ్స్‌ ఖాతాలో కనీస నిల్వకు సంబంధించి ఖాతాదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మరోసారి సమీక్షించింది. కనీస నగదు నిల్వలతో పాటు, ఆయా ఖాతాలపై విధించే రుసుములను సవరించింది. మెట్రో, పట్టణ ప్రాంతాల్లోని ఖాతాల్లో కనీస నగదు నిల్వను రూ.5వేల నుంచి రూ.3వేలకు తగ్గించింది. దీని వల్ల ఐదు కోట్ల మంది ఖాతాదారులకు లబ్ది చేకూరనుంది. నగదు నిర్వహించని ఖాతాలకు విధించే రుసుములను కూడా 20-50 శాతం మేర సవరించింది. సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో ఛార్జీలను ఆయా ఖాతాలను బట్టి రూ.20-40, మెట్రో, పట్టణ ప్రాంతాల్లో రూ.30-50 వరకు విధించింది. ఈ నిర్ణయం అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. జన్‌ధన్‌ ఖాతాలకు కనీస నగదు నిల్వల పరిమితి లేదు. తాజాగా పెన్షనర్లు, ప్రభుత్వ ప్రయోజనాలు పొందే ఖాతాదారులు, మైనర్ల ఖాతాలకూ నిల్వ అవసరం లేదని ఎస్‌బీఐ పేర్కొంది.