అఖిలపక్షానికి పార్టీలు గైర్హాజర్!

SMTV Desk 2018-04-07 16:13:37  opposition parties, all party meeting, CM Chandrababu Naidu, Special status

అమరావతి, ఏప్రిల్ 7: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పత్యేకహోదాపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాలు తమ వైఖరిని స్పష్టం చేశాయి. మరికొన్ని గంటల్లో జరగనున్న అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడం లేదని తేల్చిచెప్పాయి. ప్రత్యేకహోదా కోసం పోరాడకుండా ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు తీరును నిరసిస్తూ ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ సీపీ అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించగా అదే బాటలో ఇతర పార్టీలు నడిచాయి. భారతీయ జనతా పార్టీ, జనసేన, లెఫ్ట్‌ పార్టీలు ఈ సమావేశంలో పాల్గొనకూడదని నిర్ణయించాయి. ఈసందర్భంగా బీజేపీ ఎమ్మల్యే విష్ణుకుమార్‌ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. సీఎం ఆర్భాటం కోసమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ సైతం చివరి నిమిషాల్లో అఖిలపక్షానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. దీంతో సమావేశం అధికార పక్ష౦గా మారిపోయింది.