నేడు రాజధాని బంద్…

SMTV Desk 2020-01-04 13:15:53  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల జరిగినటువంటి శాసన సభ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతి నుండి తరలించి రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఒక సంచలనానికి తెరలేపారు. ఈమేరకు ఆగ్రహించినటువంటి అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు మరియు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వానికి వ్యక్తిరేకంగా నిరసనలు చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే వీరి విషయంలో సీఎం జగన్ స్పందించని కారణంగా వారి ఆందోళన కార్యక్రమాలను సకల జనుల సమ్మె రూపంలో మార్చి తీవ్రతరం చేశారు రైతులు…


అయితే ఈ సమ్మెలో పాల్గొన్న మహిళలపై శుక్రవారం నాడు పోలీసుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. కాగా పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా నేడు (శనివారం నాడు) అమరావతి రాజధాని బంద్‌కు రైతులు, రైతు కూలీలు పిలుపునిచ్చారు. అయితే ఎంతో శాంతియుతంగా నిరసన చేస్తున్న తమ పై రాష్ట్ర పోలీసులు దారుణంగా వ్యవహరించారని అక్కడి మహిళలందరూ కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ పోరాటాన్ని మరింతగా ఉదృతం చేస్తామని రాజధాని అమరావతి జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం రైతులందరిపై ప్రవర్తిస్తున్న తీరు సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.