నాకు మగతనం లేదు...

SMTV Desk 2020-01-04 13:12:24  

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ గ్రామంలో శ్రావణి, కల్పన, మనీషా అనే ముగ్గురు మైనర్ బాలికలను హత్యాచారాలు చేసినట్లు ఆరోపింపబడుతున్న నిందితుడు శ్రీనివాస్ రెడ్డి తనకు మగతనం లేదని కనుక తాను ఎవరినీ అత్యాచారం, హత్యలు చేయలేదని పోలీసులు, ఊర్లో కొందరు కావాలనే తనను ఈ కేసులలో ఇరికించారని కోర్టులో వాదించాడు.

ఈ కేసులను విచారిస్తున్న నల్గొండ జిల్లా ఫస్ట్ అడిషనల్ సెషన్ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి వాంగ్మూలాన్ని నిన్న రికార్డు చేయించారు. ఈ కేసులో 72 మంది సాక్షులు చెప్పిన వివరాలను, ఘటనాస్థలం నుంచి పోలీసులు సేకరించిన ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు అన్నిటినీ ఒకటొకటి న్యాయమూర్తి చదివి వినిపిస్తూ నిందితుడి వాదనలను ఓపికగా విని రికార్డు చేయించారు.

ఈ సందర్భంగా అతను “నాకు మగతనమే లేదు. చనిపోయిన బాలికలను నేను ఎన్నడూ చూడలేదు. కనుక వారి బట్టలపై నా వీర్యకణాలున్నాయనేది అబద్దం. కర్నూలులో వేశ్య హత్యతో కూడా నాకు ఎటువంటి సంబందమూ లేదు. ఈ కేసులలో పోలీసులు నన్ను ఇరికించి నా వేలిముద్రలు తీసుకొని తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించి నేను చేయని నేరం చేసినట్లు బలవంతంగా ఒప్పించారు. పోలీసులు చెపుతున్నట్లు నా దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్‌ లేదు. చిన్న ఫోన్‌ మాత్రమే ఉంది. ఊర్లో మా భూమి అమ్మడంలేదనే కక్షతో కొందరు నన్ను ఈ కేసులో ఇరికించారు. ఈ కేసులతో నాకు అసలు సంబందమే లేదు. నేను అమాయకుడిని,” అని వాదించాడు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి అతనిని అడిగిన పలుప్రశ్నలకు నిందితుడు సరైన సమాధానాలు చెప్పలేకపోయాడు. గతంలో అతను పనిచేసిన ఆఫీసు వివరాలు అడిగితే తనకు గుర్తు లేదని అబద్దం చెప్పాడు. ఒక చిన్న ఫోన్‌ మాత్రమే తన వద్ద ఉందని చెప్పిన అతనిని మరి నీ పేరుతో మూడు సిమ్ కార్డులు ఎందుకు తీసుకొన్నావు?అనే జడ్జి ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. హత్యాచారాలతో సంబందం లేదని చెప్పిన అతని వద్ద లభించిన ఆండ్రాయిడ్ ఫోన్‌లో ముగ్గురు బాలికల ఫోటోలు ఎందుకున్నాయనే ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. మొత్తం మీద అతను ఈ హేయమైన నేరాలకు పాల్పడినట్లుగా అతని మాటలతోనే రుజువయింది. అతని వాదనలను రికార్డ్ చేసిన తరువాత ఈ కేసు తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేశారు. ఈ కేసుపై విచారణ, నిందితుడి వాదనలు అన్ని పూర్తయ్యాయి కనుక జనవరి 6న న్యాయస్థానం తుదితీర్పు, శిక్షను ప్రకటించే అవకాశం ఉంది.