అనిశా వలలో మరో అవినీతి చేప...

SMTV Desk 2018-01-13 12:36:45  ACB Attacks, commissioner yedukondalu, 23.20 lakhs taken back .

అమరావతి, జనవరి 13 : అనిశా వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఏకంగా రూ.23.20 లక్షల లంచం తీసుకు౦టూ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌ ఏడుకొండలు అనిశా అధికారులకు పట్టుబడ్డారు. విశాఖపట్నం నౌకాశ్రయంలో బెర్త్‌ల నిర్మాణం కోసం చేపట్టిన పనులకు సంబంధించి రూ.4.67 కోట్లు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నుంచి రావాల్సి ఉంది. ఈ దస్త్రం శాఖలో కమిషనర్‌ ఏడుకొండలు వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ కంపెనీకి చెందిన న్యాయ సలహాదారు గోపాల్‌శర్మ స్వయంగా రంగంలోకి దిగి అదనపు కమిషనర్‌తో మాట్లాడి దస్త్రం పరిష్కరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.25 లక్షలు చెల్లించేలా అంగీకరించారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు దాడి చేసి ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న డబ్బును లెక్కించగా రూ.23.2 లక్షలు ఉన్నట్లు తేలింది. కేసుకు సంబంధించి ఏడుకొండలుతో పాటు ఆయన కార్యాలయ సూపరింటెండెంట్‌ అనంతరెడ్డి, కంపెనీ ప్రతినిధులు గోపాల్‌శర్మ, సత్యనారాయణలను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులో లంచం తీసుకున్న వారిని, ఇచ్చే వారిని ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఇద్దరిని నిందితులుగా చేర్చడం ఇదే మొదటిసారి.